OG Tour India | హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. థమన్ ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ‘ఓజీ టూర్ ఇండియా’ (OG Tour India) లైవ్ కాన్సర్ట్ చివరి నిమిషంలో రద్దయింది. జూన్ 13న నగరంలోని బౌల్డర్ హిల్స్‌లో జరగాల్సిన ఈ మెగా మ్యూజికల్ ఈవెంట్.. ఈదురుగాలులతో కూడిన వాన వల్ల స్టేజ్ పరిసరాల్లో నీరు నిలిచిపోవడంతో నిర్వాహకులు అనివార్యంగా రద్దు చేయాల్సి వచ్చింది. నిజానికి ఈ షో అంతకుముందే జరగాల్సి ఉండగా, వర్షం కారణంగానే జూన్ 13కి వాయిదా వేశారు. ఇప్పుడు రెండోసారి కూడా వరుణుడి దెబ్బతో షో రద్దు కావడంతో థమన్ అభిమానులు, సంగీత ప్రియులు తీవ్ర నిరాశకు గురయ్యారు. హఠాత్తుగా కురిసిన ఈ భారీ వర్షం వల్ల భద్రతా పరమైన ఇబ్బందులు రావడం, కొన్ని విలువైన సంగీత పరికరాలు తడిసిపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో థమన్ సోషల్ మీడియా వేదికగా ఎంతో భావోద్వేగంతో స్పందిస్తూ ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ఈ వార్త తన హృదయాన్ని ముక్కలు చేసిందని, తన 56 మంది సభ్యుల బృందంతో కలిసి గత 45 రోజులుగా ఈ టూర్ కోసం ఎంతో శ్రమించామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన ప్రతి ఫీడ్‌బ్యాక్‌ను సానుకూలంగా తీసుకుంటూ, ఈ కాన్సర్ట్‌ను విజయవంతం చేయడం కోసం తమ టీమ్ ప్రపంచంలోని మంచి ఎనర్జీనంతటినీ కూడగట్టుకుందని చెప్పారు. కానీ కొన్నిసార్లు దేవుడి ప్లాన్స్ వేరేగా ఉంటాయని మనం అర్థం చేసుకోవాలని, తాను ఎప్పుడూ దేవుణ్ణి, విధిని బలంగా నమ్ముతానని పేర్కొన్నారు. ఇప్పుడు తనకు కావాల్సిందల్లా అభిమానుల ప్రేమ, నమ్మకం మాత్రమేనని.. ‘ఓజీ కాన్సర్ట్’ ఏమాత్రం తక్కువ కాదని అందరూ నమ్మేలా చేస్తానని, తన కమ్‌బ్యాక్స్ ఎప్పుడూ మరింత స్ట్రాంగ్‌గా ఉంటాయని తమన్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఈ హైదరాబాద్ షోకు సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నిర్వాహక సంస్థలైన ACTC ఈవెంట్స్, క్యాప్స్టాక్ వెల్లడించాయి. ఈ టూర్లో భాగంగా బెంగళూరు, చెన్నై, వైజాగ్‌లలో కూడా తదుపరి కాన్సర్ట్స్ యథావిధిగా జరగనున్నాయి.