యువ హీరో రాజ్ తరుణ్‌కు జూనియర్ రవితేజ అనే పేరు ఉండేది. ఉత్సాహంగా నటించగలిగే కొన్ని సినిమాల్లో అతను బాగా నటించాడు. ఆ చిత్రాలూ విజయవంతం అయ్యాయి. దాంతో రవితేజలా ఎనర్జిటిక్ గా నటిస్తున్నాడని పోల్చారు. రాజ్ తరణ్ కెరీర్ గతంలో అంత వేగంగా లేకున్నా, తనకున్న ప్రాజెక్టులు చేసుకుంటున్నాడు. ఇలా సాగుతున్న ప్రయాణంలో ఓ క్రేజీ ఆఫర్ అతనికి వచ్చిందని టాక్ వినిపిస్తోంది.
దర్శకుడు త్రినాథరావు నక్కిన రవితేజతో ధమాకా అనే సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలు. శ్రీలీల నాయికగా నటిస్తోంది. నాయిక ఫస్ట్ లుక్ ను ఇటీవలే విడుదల చేశారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందని ఆ క్యారెక్టర్ ను రాజ్ తరుణ్ కు దర్శకుడు ఆఫర్ చేశాడని సమాచారం.
రాజ్ తరుణ్, దర్శకుడు త్రినాథరావు నక్కిన మంచి స్నేహితులు. గతంలో వీరి కాంబినేషన్ లో ‘సినిమా చూపిస్త మావా’ చిత్రం తెరకెక్కి మంచి విజయం సాదించింది. రాజ్ తరుణ్ అయితే ధమాకాలోని పాత్రకు బాగా సరిపోతాడని త్రినాథరావు భావించారట. ఇప్పుడున్న టైమ్‌లో రాజ్ తరుణ్‌కు ఇది కాదనలేని అవకాశమే. హీరోలు ఇదే చేస్తామనే ట్రెండ్ మారిపోయిన పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ యువ హీరో కూడా ఓకే చెప్పేందుకే మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది.