సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా 2005లో వచ్చిన ‘నో ఎంట్రీ’ చిత్రం చక్కటి వినోదంతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని సల్మాన్‌ఖాన్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. దర్శకుడు అనీస్ బాజ్మీతో కలిసి స్క్రిప్ట్ వర్క్‌లో కూడా పాలుపంచుకున్నారు. తన కెరీర్లోనే అత్యుత్తమ వినోదాత్మక కథాంశంగా తీర్చిదిద్దుతున్నామని సల్మాన్ పలు సందర్భాల్లో చెప్పారు. వచ్చే జనవరిలో షూటింగ్ ప్రారంభమవుతుందని చిత్రబృందం ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం నిర్మాణ సంస్థలో నెలకొన్న ఆర్థికపరమైన సంక్షోభంతో ఈ సినిమా నుంచి వైదొలగాలని సల్మాన్‌ఖాన్ నిర్ణయించుకున్నారట.
ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న సహారా వన్ మోషన్ పిక్చర్స్ దివాళ తీయడంతో బడ్జెట్ కేటాయింపులో న్యాయపరమైన సమస్యలు తలెత్తాయని తెలిసింది. కంపెనీ వాటాదారుల నుంచి కూడా అభ్యంతరాలు రావడంతో ఈ సినిమా నుంచి పూర్తిగా తప్పుకోవడమే మేలని సల్మాన్‌ఖాన్ నిర్ణయించుకున్నారని సమాచారం. తాను ఎంతగానో ఇష్టపడ్డ స్క్రిప్ట్ అయినప్పటికీ న్యాయపరమైన వివాదాలతో అనవసర కాలయాపన జరుగుతందనే ఉద్దేశ్యంతో ‘నో ఎంట్రీ-2’ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలని సల్మాన్‌ఖాన్ నిర్మాతలకు సూచించారని తెలిసింది. అయితే ఈ చిత్ర దర్శకుడు అనీస్ బాజ్మీతో కలిసి సల్మాన్‌ఖాన్ మరో కామెడీ కథతో సినిమాకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.