‘బద్మాషులు’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కావడం సంతోషాన్నిచ్చిందని, ఈ సినిమాను ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారని చెప్పారు చిత్ర హీరో చింతల మహేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మా స్వస్థలం నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి. మాది మధ్యతరగతి కుటుంబం. మిర్యాలగూడలో ఓ మెకానిక్ షేడ్‌లో పనిచేస్తూ ఇంటర్ వరకు చదివాను. సినిమా అవకాశాలను అన్వేషిస్తూ 2013లో హైదరాబాద్‌కు చేరుకున్నా’ అని తెలిపారు.
సత్యం, యాబి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్స్‌లో నటనలో శిక్షణ తీసుకున్నానని, థియేటర్ ఆర్ట్స్ కూడా చేశానని, రాత్రిళ్లు క్యాబ్‌డ్రైవర్‌గా పనిచేస్తున్న టైంలో దర్శకుడు తరుణ్‌భాస్కర్‌తో అనుకోకుండా ఏర్పడిన పరిచయం ఇండస్ట్రీలో అవకాశాన్ని తెచ్చిపెట్టిందన్నారు. “ఈ నగరానికి ఏమైంది’ చిత్రం మొదలుకొని తాను దర్శకత్వం వహించిన ప్రతీ చిత్రంలో తరుణ్‌భాస్కర్ అవకాశమిచ్చారు. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘పిట్టకథలు’ సిరీస్ నాకు పేరు తెచ్చింది. ఆ తర్వాత భామ కలాపం, సత్తిగాని రెండెకరాలు, గాడ్స్ ఆఫ్ ధర్మపురి, స్కైలాబ్, కీడాకోలా, మాయాబజార్, శివరపల్లి వంటి 30కిపైగా వెబ్‌సిరీస్, సినిమాల్లో నటించా. మరో 15 చిత్రాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి’ అని చింతల మహేష్ తెలిపారు.