Hari Hara Veeramallu | దాదాపు ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న హరిహర వీరమల్లు చిత్రం ఎట్టకేలకి జులై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతుంది. ఇక ఈ సినిమాని పలువురి కోసం ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. రాజానగరం అసెంబ్లీ నియోజక వర్గ విద్యార్ధులకి ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ ఫ్రీ షో ఏర్పాటు చేశారు. ఈ రోజు తొమ్మిది, పది, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు సీతానగరంలోని రామకృష్ణ థియేటర్, గీతా సినిమాస్లలో ఉచితంగా సినిమా చూడొచ్చని తెలియజేశారు. మొత్తం రెండు షోలు వేస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని బత్తుల అన్నారు.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో పనిచేస్తున్న తెలుగు అధికారులు, కేంద్ర ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు మరియు వివిధ రంగాల్లో స్థిరపడిన తెలుగు ప్రజల కోసం ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు ఏపీ భవన్ లో హరిహర వీరమల్లు చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆడిటోరియంలో శని, ఆదివారాల్లో ప్రత్యేక షోలుగా ప్రదర్శిస్తున్నారట. శనివారం రాత్రి 7 గంటలకు ఏర్పాటు చేసిన మొదటి షోకు మంచి స్పందన లభించింది.ఇక జూలై 27వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు రెండో షోను ప్రదర్శించనున్నారు.ఈ షోల ముఖ్య ఉద్దేశం, తెలుగు వారి మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని మెరుగుపరచడం అని అధికారులు తెలిపారు.
క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం జూలై 24న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. తొలి రోజు దాదాపు ₹70 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిందని సమాచారం.అయితే ఫస్టాఫ్ బాగానే ఆకట్టుకుందనీ, కానీ రెండవ భాగం అంతగా ఆకట్టుకోలేకపోయిందని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది, స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా “ఈ సినిమాకు కీరవాణి సంగీతమే ప్రాణవాయువు” అంటూ పలు వేదికలపై ప్రశంసించారు.