Hari Hara Veeramallu | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం సమర్పణలో నిర్మితమైన పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరిహర వీరమల్లు’. జులై 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రాన్ని తొలుత క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేయగా, కొన్ని కారణాలతో ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అనంతరం ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టి సినిమా పూర్తి చేశాడు. 16వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం, కోహినూర్ డైమండ్ నేపథ్యంగా ఈ చిత్రం రూపొందింది. పవన్ కళ్యాణ్ ఇందులో వీరమల్లు అనే యోధుడిగా అద్భుతమైన పాత్ర పోషించగా, సత్యరాజ్, సునీల్, నాజర్, బాబీ డియోల్, సుబ్బరాజు వంటి నటులు కీలక పాత్రల్లో మెరిశారు.
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం రాత్రే ప్రీమియర్ షోలకు తెరలేవగా, కొన్ని థియేటర్లలో టిక్కెట్లు రూ.600ల వరకు ఉన్నాయి (జీఎస్టీ అదనం). టికెట్ ధరలు పెరిగినా ఫ్యాన్స్ ఎగబడి షోలకు హాజరయ్యారు. కొన్ని వందల థియేటర్లలో ప్రీమియర్ షోలు వేయడంతో వీటి వసూళ్లపై టాలీవుడ్ మొత్తం దృష్టి పెట్టింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘హరిహర వీరమల్లు’ ప్రీమియర్ షోల ద్వారా రూ. 20–25 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇది పవన్ కెరీర్లోనే అత్యధిక ప్రీమియర్ షో కలెక్షన్గా నిలిచే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రీమియర్ షోస్‌పై చిత్ర బృందం కూడా స్పందిస్తూ, అన్ని ప్రాంతాల నుంచి వస్తున్న స్పందన అద్భుతమని, థియేటర్లు హౌస్‌ఫుల్ కావడం మంచి సంకేతమని ట్వీట్ చేసింది. అయితే అధికారిక నంబర్లు మాత్రం వెల్లడించలేదు.
పవన్ కళ్యాణ్ చేసిన వీరమల్లు పాత్ర అభిమానులకి స్పెషల్ ప్యాకేజీలా అనిపించింది. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్లు సినిమాకు కొంత ఊపిచ్చాయి. నిధి అగర్వాల్ గ్లామర్‌తో పాటు అభినయంతో ఆకట్టుకుంది. ఔరంగజేబుగా బాబీ డియోల్‌కి మంచి స్కోప్ దక్కింది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ రూ.100 కోట్ల నెట్ క్లబ్లో చేరకపోయినా, ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మళ్ళీ ఫోకస్ తెచ్చుకోవచ్చని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సినిమా విడుదలైన తొలి రోజు నుంచే సోషల్ మీడియాలో హిట్, ఫ్లాప్ వాదనలు ఉధృతంగా సాగుతున్నాయి. కొందరు సినిమా విజువల్స్, పవన్ స్టైల్‌ను ప్రశంసిస్తుండగా, మరికొందరు కథ నెమ్మదిగా సాగుతుందంటూ విమర్శిస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ విజయం సాధిస్తుందా లేదా అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది.