Hari Hara Veeramallu | దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు. చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందిన ‘హరి హర వీరమల్లు’ జూలై 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నేపథ్యంలో, విడుదలకు నాలుగు రోజుల ముందు అంటే జూలై 20న భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలుత ఈ వేడుకను తిరుపతి లేదా విజయవాడలో నిర్వహించాలని యూనిట్ భావించినా, చివరికి విశాఖపట్నం సముద్రతీరాన్ని వేదికగా ఎంచుకున్నారు. అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యేలా అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ గ్రాండ్ ఈవెంట్‌కు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని సమాచారం. రాజమౌళి అన్నగా గౌరవించే ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించడం, అలాగే పవన్- త్రివిక్రమ్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధం, ఈ ఇద్దరినీ ఈ వేడుకకు ఆహ్వానించడానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. నిర్మాత ఏ.ఎం. రత్నం వారిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు సమాచారం. ట్రైలర్ విడుదల అనంతరం సినిమా బిజినెస్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నట్లు టాక్.తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా విడుదలకానుంది. పవన్‌కు పాన్-ఇండియా స్థాయిలో ఉన్న క్రేజ్ సినిమాకు హైప్‌ను మరింత పెంచుతోంది.
దర్శకుడు జ్యోతి కృష్ణ రూపొందించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో, దయాకర్ రావు ‘మెగా సూర్య ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై నిర్మించారు. సినిమా సంగీతాన్ని ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సమకూర్చారు.పవన్ కళ్యాణ్ వీరమల్లు పాత్రలో కనిపించనుండగా ఔరంగజేబుగా ప్రతినాయక పాత్రలో బాబీ డియోల్ కనిపించి సందడి చేయనున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా కనిపించనుంది. అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నోరా ఫతేహి క ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ అయిన తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా హరిహర వీరమల్లు కావడంతో ఈ మూవీపై అందరిలో ఆసక్తి నెలకొంది.