Hari Hara Veeramallu | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ మూవీ జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. నిన్న ఈ మూవీ ట్రైలర్ విడుదల కాగా, ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన లభించింది. కేవలం 24 గంటల్లోనే తెలుగు ట్రైలర్‌కు 48 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇది ఆల్‌టైమ్ రికార్డుగా నిలిచింది. అంతేకాదు, అన్ని భాషల్లో కలిపి ట్రైలర్‌కు 61.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ గణాంకాల నేపథ్యంలో చిత్ర బృందం ఒక ఆసక్తికర కామెంట్ చేసింది. “ఇది సాధారణ రికార్డ్ కాదు, భవిష్యత్తులో వచ్చే సినిమాలన్నింటికీ ఇది ఒక హెచ్చరిక. అంటూ రాసుకొచ్చారు. మరోవైపు ఇది పుష్ప2 రికార్డ్ కూడా బ్రేక్ చేసిందని అంటున్నారు. ఇప్పటి వరకు సౌత్ ఇండియాలో విడుదలైన 24 గంటలలో 44.67 మిలియన్ వ్యూస్ సాధించిన పుష్ప 2 సాధించింది. ఇప్పుడు దానిని హరిహర వీరమల్లు బ్రేక్ చేసింది. కేవలం 23 గంటల్లోనే 47 మిలియన్స్ వ్యూస్ సాధించి పుష్ప2 రికార్డ్ బ్రేక్ చేసిందని అంటున్నారు. ఈ రికార్డులతో పవన్ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు.
ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 17వ శతాబ్దం ముస్లిం పాలన సమయంలో పవన్ కళ్యాణ్ ఓ వీరుడిగా, ప్రజా పరిరక్షణ కోసం పోరాడే పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆయన పాత్ర శౌర్యం, తెలివి, ధైర్యం మేళవింపుతో ఉంటుందని తెలుస్తోంది.ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఎ.ఎం. రత్నం సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. మొదట దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని రూపొందించగా, మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత మిగిలిన భాగాన్ని రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ పూర్తి చేశారు.