పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా రూపొందిన తొలి పాన్ ఇండియా సినిమా ‘హరిహర వీరమల్లు’. ఆయన నటించిన తొలి జానపద చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఇందులో పవన్‌కల్యాణ్ రాబిన్‌హుడ్ తరహా పాత్రను పోషించారు. చరిత్రలో ఉన్న పాత్రలను తీసుకొని జానపద ధోరణిలో తీసిన కాల్పనిక కథాంశమిది. ఈ ప్రతిష్టాత్మక ఫోక్లర్ చిత్రాన్ని కొంతభాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, ప్రస్తుత దర్శకుడు ఎ.ఎం.జ్యోతికృష్ణ. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకరరావు భారీబడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని గురువారం అభిమానుల సమక్షంలో హైదరాబాద్‌లో ఘనంగా లాంచ్ చేశారు. ట్రైలర్‌ని మించి సినిమా ఉంటుందని చిత్ర సమర్పకుడు ఏ.ఎం.రత్నం అన్నారు. పవన్‌కల్యాణ్ హృదయాన్ని ప్రతిబింబించేలా సినిమా ఉంటుందని నిర్మాత ఎ.దయాకరరావు పేర్కొన్నారు.
దేశం తిరిగి చూసేలా ఈ సినిమా ఉండబోతున్నదని దర్శకుడు జ్యోతికృష్ణ తెలిపారు. ఇంకా కథానాయిక నిధి అగర్వాల్ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు. మూడు నిమిషాల నిడివితో రూపొందిన ఈ ట్రైలర్లో ఢిల్లీ సుల్తానుల నుంచి సనాతన ధర్మాన్ని రక్షించేందుకు నడుం బిగించిన యోధుడిగా, మొఘల్ శక్తిని ధిక్కరించిన ధీరుడిగా పవన్‌కల్యాణ్ కనిపించగా, బాబీడియోల్ ఔరంగజేబుగా అత్యంత భయంకరంగా అగుపించారు. కోహినూర్ వజ్రం కోసం పోరాటం.. మొఘలులతో వీరమల్లు తలపడటం వంటి సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్లో ‘ఆంధి వచ్చేసింది..’ (పెనుగాలి వచ్చేసింది) అనే డైలాగ్ ప్రత్యేక ఆకర్షణ. అలాగే ‘అందరూ నేను రావాలని దేవుడ్ని ప్రార్థిస్తారు.. కానీ మీరు మాత్రం నేను రాకూడదని కోరుకుంటున్నారు..’ అనే మరో డైలాగ్ కూడా అభిమానుల్ని ఆకట్టుకుంటున్నది. అలాగే యుద్ధ సన్నివేశాలు కూడా భారీగా కనిపిస్తున్నాయి.