Hari Hara Veeramallu | అగ్ర హీరో పవన్‌కల్యాణ్ ఎట్టకేలకు ‘హరిహరవీరమల్లు’ సినిమా షూటింగ్‌ను పూర్తిచేశారు. ఏపీ డిప్యూటీ సీఎంగా పాలనాపరమైన వ్యవహారాలతో బిజీగా ఉండటం వల్ల ఆయన సినిమా షూటింగ్స్‌లో జాప్యం జరుగుతున్న విషయం తెలిసిందే. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ అయితే పూర్తయింది… మరి రిలీజ్ డేట్‌ను ఎప్పుడు ప్రకటిస్తారో అంటూ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9న ఈ సినిమా విడుదల కావాల్సింది. అయితే కొంత షూటింగ్ పార్ట్ మిగిలి ఉండటంతో ఆ రోజు రిలీజ్ సాధ్యపడలేదు.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి సోషల్‌మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది. బుక్‌మైషో యాప్‌లో ఈ సినిమాను జూన్ 12న రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫ్యాన్స్ ఈ స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ అదే రోజు సినిమా రిలీజ్ ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. అయితే బుక్‌మైషో పేర్కొన్న రిలీజ్ డేట్ నిజమా? కాదా? అనే విషయంలో స్పష్టత లేదు. చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వస్తేనే రిలీజ్ డేట్‌పై క్లారిటీ వస్తుందంటున్నారు. జ్యోతికృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు.