Hari hara veera mallu | పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబోలో చాలా కాలం క్రితం మొదలైన ‘హరిహర వీరమల్లు’ సినిమా ఇంత వరకు థియేటర్స్‌లోకి రాలేదు. పవన్ రాజకీయాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమా షూటింగ్ కూడా సజావుగా జరగకపోవడంతో క్రిష్ తప్పుకున్నాడు. జ్యోతికృష్ణ టేకప్ చేసి ఇటీవలే షూటింగ్ పూర్తి చేశాడు. ఐదేళ్లుగా సెట్స్ పై ఉన్న ఈ సినిమా జూన్ 12న విడుదల కానుందంటూ ఇటీవల మేకర్స్ ప్రకటించారు. కాని ఆ సమయానికి కూడా మూవీ రిలీజ్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. అందుకు కారణం జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని తెలుగు రాష్ట్రాల సినీ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకుంది. అద్దె ప్రాతిపాదికన సినిమాలను ప్రదర్శించలేమని, పర్సంటెజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామంటూ నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్లు తీర్మానం చేశారు.
మరి ఈ క్రమంలో జూన్ 1 నుండి సినిమా థియేటర్స్ బంద్ అయితే హరిహర వీరమల్లు పరిస్థితి ఏంటనే ఆలోచనలో అభిమానులు ఉన్నారు. జూన్‌లో హరిహర వీరమల్లుతో పాటు థగ్ లైఫ్, కన్నప్ప, కుబేర, కింగ్డమ్ వంటి సినిమాలు రిలీజ్ కానున్నాయి . అన్ని పెద్ద సినిమాలే కాబట్టి వీలైనంత తొందరగా ఈ సమస్య సాల్వ్ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. కాగా హరిహర వీరమల్లు సినిమా మొదట 2022 జనవరిలో సంక్రాంతికి వస్తుందని ప్రకటించారు. ఆ తర్వాత 2022 ఏప్రిల్ 29 సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కానీ అప్పటికి షూటింగ్ పూర్తి కాకపోవడంతో తిరిగి వాయిదా వేశారు. 2022 అక్టోబర్ 5న చిత్ర రిలీజ్ అన్నారు. అది కూడా వాయిదా పడింది.
ఆ తర్వాత 2023 జనవరి సంక్రాంతికి వస్తుందని ప్రకటించారు. కాని అప్పుడు వాయిదా పడింది. 30 మార్చ్ 2023 అని రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రిలీజ్ కాలేదు. 2023 దసరాకి వస్తుందన్నారు రాలేదు. 2024 సమ్మర్ కి వస్తుంది అని చెప్పిన అప్పుడు రాలేదు. ఇక 2024 డిసెంబర్ లో వస్తుంది అని హడావిడి చేసి షూటింగ్ స్పీడ్ పెంచిన కూడా రిలీజ్ కాలేదు. 26 జనవరి 2025న పక్కా అని అన్నారు కానీ రిలీజ్ అవ్వలేదు. 28 మార్చ్ 2025 రిలీజ్ ఖాయం అంటూ తెగ హడావిడి చేశారు. కాని గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో పోస్ట్ పోన్ చేసి మే 9న తప్పక విడుదల చేస్తామని అన్నారు. అయితే ఆ డేట్‌కి రిలీజ్ కాలేదు. చివరికి జూన్ 12న రిలీజ్ అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.