Hari Hara Veera Mallu | పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘హరి హర వీర మల్లు’ విడుదల తేదీ మళ్లీ వాయిదా పడింది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన డేట్ ప్రకారం జూన్ 12న ఈ సినిమా విడుదల కావట్లేదని త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను అత్యుత్తమ చిత్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
అలాగే సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి వస్తున్న రూమర్స్‌తో పాటు గాసిప్ వార్తలను నమ్మకండంటూ చిత్రబృందం తెలిపింది. కేవలం చిత్రయూనిట్‌కి చెందిన అధికారిక హ్యాండిల్స్ ద్వారా వచ్చే అప్డేట్లను మాత్రమే నమ్మాలని అభిమానులను కోరింది. ఈ సినిమా విడుదల తేదీతో పాటు ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఎ.ఎమ్. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఎ.ఎమ్. రత్నం సమర్పణలో, మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ. దయాకర్ రావు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.