Hari Hara Veeramallu | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ ఈ నెల 24న రిలీజై బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ బీభత్సం సృష్టించింది.ఇక రెండో రోజు కాస్త కలెక్షన్స్ తగ్గాయి. సాధారణంగా ప్రతీ సినిమా రిలీజ్ అయిన నాటి నుంచి సోషల్ మీడియా వేదికగా చిత్ర నిర్మాణ సంస్థలు కలెక్షన్స్ అధికారికంగా ప్రకటిస్తుంటాయి. కాని పవన్ సినిమాకు మాత్రం కలెక్షన్స్ ఎంత అనే దానిపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటన లేదు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఇచ్చిన సంగతి కూడా విదితమే.
చిత్రంలో పవన్ కల్యాణ్ నటన, యాక్షన్ సీన్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ చిత్రం మరింత మంది ప్రేక్షకులకు చేరువ కావాలన్న ఉద్దేశంతో చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా, ఇప్పటి వరకు ఉన్న పెరిగిన టికెట్ ధరలను తగ్గించి మళ్లీ సాధారణ ధరలకే తీసుకువచ్చారు. ఈ మార్పులు ఈ రోజు (సోమవారం) నుంచే అమల్లోకి వస్తాయని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే బుక్ మై షో, డిస్ట్రిక్ట్ వంటి ఆన్లైన్ టికెట్ ప్లాట్‌ఫార్మ్స్‌లో తగ్గిన రేట్లు కనిపిస్తూ ఉన్నాయి. సింగిల్ స్క్రీన్లలో బాల్కనీ టికెట్ ధర రూ.175గా, మల్టీప్లెక్స్‌లలో రూ.295గా నిర్ణయించబడ్డాయి. టికెట్ ధరల తగ్గింపుతో ప్రేక్షకుల రెస్పాన్స్ మరింతగా పెరిగి, సినిమా కలెక్షన్లపై సానుకూల ప్రభావం చూపుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను సిల్వర్ స్క్రీన్‌పై యోధుడి పాత్రలో చూసిన ఫ్యాన్స్ ఆనందం అవధులు దాటింది. పవన్ సరసన పంచమిగా నిధి అగర్వాల్ తన నటనతో మెప్పించారు. బాబీ డియోల్ విలన్ రోల్ పోషించగా… నోరా ఫతేహి, జిషు సేన్ గుప్తా, సత్యరాజ్, రఘుబాబు, సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎఎం రత్నం సమర్పణలో ఎ.దయాకరరావు మూవీని నిర్మించారు.