‘మీటూ’ ఉద్యమానికి మొదటి గొంతుకగా నిలిచిన నటి తనుశ్రీ దత్తా. ఒక దశలో బాలీవుడ్లో మోస్ట్ రొమాంటిక్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. కొద్ది రోజులకే ఇండస్ట్రీని వదిలేసి.. లైమ్‌లైట్‌కు దూరమైంది. తాజాగా, తీవ్రమైన దుఃఖంతో అభిమానుల ముందుకొచ్చింది. ఓ సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ.. తనపై జరుగుతున్న వేధింపులు, ఒత్తిడి, అండర్ వరల్డ్ బెదిరింపుల గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన పరిస్థితి.. ఆత్మహత్యకు ముందు సుశాంత్ సింగ్ రాజ్పుత్లానే ఉన్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘మా ఇద్దరి జీవితాలకు మధ్య సమాంతర పోలికలు ఉన్నాయ’ని చెప్పుకొచ్చింది.
నిజానికి 2020లో సుశాంత్ సింగ్ అకాల మరణానికి ముందు.. వీళ్లిద్దరూ కలిసి ఒక సినిమాలో పనిచేయాలని నిర్ణయించుకున్నారట. కానీ, తామిద్దరిపై సంవత్సరాల తరబడి సాగిన వేధింపుల వల్ల.. ఆ సినిమా పట్టాలెక్కలేదని తను ఆవేదన వ్యక్తంచేసింది. ‘కొన్నేళ్లుగా నాపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ‘మీటూ’ ఉద్యమంలో గొంతు కలిపినప్పటి నుంచి నా జీవితం అల్లకల్లోలంగా మారిపోయింది. నాకు తెలియకుండానే నేనుండే భవంతిలో సెక్యూరిటీని మార్చారు. నా ఇంటిని దోచుకున్నారు. కనీసం కడుపు నిండా తినడానికి వీలులేకుండా.. పనిమనుషులతో కలిసి కుట్రలు పన్నుతున్నారు’ అంటూ ఆరోపణలు చేసింది.
తన జీవితంలో అన్నిటికన్నా బాధాకరమైన విషయం.. సుశాంత్ సింగ్ మరణమేనని చెప్పింది. ‘సుశాంత్ సింగ్‌తో కలిసి ఒక సినిమాలో పనిచేసే అవకాశం దక్కింది. ప్రముఖ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నానని చాలా సంతోషించా. మళ్లీ ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయని ఆశపడ్డా! కానీ, సుశాంత్ మరణంతో.. నా ఆశల సౌధాలన్నీ కుప్పకూలాయి’ అంటూ ఆవేదన చెందింది తనూశ్రీ దత్తా. ఇక సుశాంత్ మరణానికి, తాను కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న వేధింపులకు మధ్య బలమైన సంబంధం ఉన్నదని ఆమె ఆరోపిస్తున్నది. సుశాంత్‌లా తానుకూడా తనువు చాలించేలా, పూజా మిశ్రాలాగా మానసిక క్షోభకు గురయ్యేలా మానసికంగా హింసిస్తున్నారంటూ చెప్పుకొచ్చింది. ‘2018లో ‘మీటూ’ ఉద్యమ నేపథ్యంలో నన్ను అంతమొందించడానికి కొందరు ప్రయత్నించారు.
ఇందుకోసం అండర్ వరల్డ్ మాఫియాకు కాంట్రాక్టు అప్పగించారు. ప్రస్తుతం నా ప్రాణాలకు ముప్పు లేనప్పటికీ.. కొన్నేళ్లుగా జరుగుతున్న అన్ని సంఘటనలనూ జాగ్రత్తగా నమోదు చేస్తున్నా. పోలీసులకు ప్రతి విషయాన్నీ పక్కగా అందించడమే నా లక్ష్యం’ అని చెప్పుకొచ్చింది. కొన్నేళ్లుగా ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా జీవితాన్ని గడుపుతున్న తనకు.. మళ్లీ వేదింపులు మొదలయ్యాయని ఆందోళన వ్యక్తం చేసింది. తగిన సమయంలో అన్ని విషయాలనూ బయటపెడతాననీ, అప్పటిదాకా ఓపికగా ఉండాలని అభిమానులను కోరింది.