‘హ్యాపీ ఎండింగ్’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతున్నది అపూర్వ రావు. యష్‌పూరి హీరోగా కౌశిక్ భీమిడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదలకానుంది. ఈ సందర్భంగా అపూర్వ రావు మాట్లాడుతూ ‘మా స్వస్థలం ఒంగోలు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కొన్ని కార్పొరేట్ కంపెనీస్‌లో జాబ్స్ చేశాను. కానీ ఏ ఉద్యోగం నచ్చలేదు. నా మిత్రుల ద్వారా ‘హ్యాపీ ఎండింగ్’ సినిమా ఆడిషన్స్ ఇచ్చే అవకాశం దక్కింది.
ఈ సినిమాలో నేను యోగా టీచర్ పాత్రలో కనిపిస్తా. ఈ సినిమాలో హీరోకు ఓ శాపం ఉంటుంది. ఆయన ఎవరి గురించి ఆలోచిస్తాడో వాళ్లకు సమస్యలొస్తుంటాయి. అలాంటి అబ్బాయిని అర్థం చేసుకొని అండగా నిలిచే పాత్ర నాది. నా పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పాను. హీరోకు ఉండే శాపం వల్ల అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ క్రమంలో పండే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. నటనలో నేను సాయిపల్లవిని స్ఫూర్తిగా తీసుకుంటా’ అని చెప్పింది.