Guardian Movie OTT | దేశముదురు నటి హన్సిక (Hansika)హీరోయిన్గా నటించిన చిత్రం గార్డియన్. శబరి గురు శరవణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. 2024 మార్చి 8న తమిళంలో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ చిత్రం ప్రస్తుతం తమిళంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా తెలుగులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. భవాని మీడియా ద్వారా ఈ సినిమా తెలుగులోకి అందుబాటులోకి వచ్చింది. హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రానికి సామ్ సి.ఎస్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించగా.. కె.ఏ. శక్తివేల్ సినిమాటోగ్రఫీ అందించాడు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అపర్ణ (హన్సిక) చిన్నతనం నుంచి దురదృష్టం వెంటాడుతుంది. ఏది కోరుకున్నా అది సాధ్యం కాదు. చివరకు దేవుని హారతి తీసుకోవాలనుకున్నా, అపర్ణ చేతులు జోడించగానే దీపం ఆరిపోతుంది. ఆమె ప్రేమ బ్రేకప్‌తో ముగుస్తుంది. అందరూ ఆమెను “అన్‌లక్కీ అపర్ణ” అని పిలుస్తారు. ప్రాజెక్ట్ పనిలో భాగంగా ఓ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరకు వస్తుంది అపర్ణ. అక్కడ ఆమెకు ఓ క్రిస్టల్ (మెరుపు రంగు రాయి) లభిస్తుంది. అప్పటి నుంచి అపర్ణ జీవితం పూర్తిగా మారిపోతుంది.
అపర్ణ (హన్సిక) ఏది కోరుకుంటే అది జరిగిపోవడం ప్రారంభమవుతుంది. కే అనే పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలో ఆమెకు ఉద్యోగం లభిస్తుంది. అపర్ణకు దూరమైన ప్రేమికుడు ప్రభ కూడా అక్కడే ఆమెకు మళ్లీ తారసపడతాడు. అభిప్రాయ భేదాలు తొలగిపోయి వీరిద్దరూ ఒకటవుతారు. అయితే, ఆఫీసులో ప్రాజెక్ట్ మేనేజర్ మరియు కంపెనీ హెడ్ తమ్ముడు కారణంగా అపర్ణతో పాటు మిగిలిన ఉద్యోగులందరూ ఇబ్బందులు పడతారు. వారిద్దరూ చనిపోతే బాగుంటుందని అపర్ణ కోరుకుంటుంది.
అపర్ణ కోరినట్లుగానే, ఆమె కళ్ల ముందే వారిద్దరూ దారుణంగా చనిపోతారు. అపర్ణ మనసులో కోరిన కోరికలన్నీ ఎలా నెరవేరుతున్నాయి? ఆ కోరికలకు ఆ క్రిస్టల్కు ఉన్న సంబంధం ఏమిటి? ఆ క్రిస్టల్లో బంధించబడిన మీరా అనే ఆత్మ ఎవరు? గౌతమ్, త్యాగు మరియు వారి మరో ఇద్దరు స్నేహితులపై మీరా పగతో రగిలిపోవడానికి కారణం ఏమిటి? మీరా ఎలా చనిపోయింది? మీరా జరిగిన అన్యాయంపై అపర్ణ ఎలా ప్రతీకారం తీర్చుకుంది? మీరా కూతురికి గార్డియన్‌గా ఉండటానికి అపర్ణ ఒప్పుకుందా లేదా? ఇదే “గార్డియన్” (Hansika Guardian) సినిమా కథ.