Gv Prakash | సింపథీని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే వారు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ తరహా సైబర్ మోసాలు సామాన్యులనే కాదు, సెలబ్రిటీలను కూడా వదలడం లేదు. తాజాగా ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ ఈ తరహా ఆన్లైన్ మోసానికి గురయ్యారు. భావోద్వేగాలను రెచ్చగొట్టే నకిలీ ప్రచారంతో ఓ వ్యక్తి ఆయన నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే… ఎక్స్ (ట్విట్టర్)లో @prasannasathis అనే ఖాతా ద్వారా ఓ వ్యక్తి ఓ వృద్ధురాలి ఫోటోను పోస్ట్ చేశాడు. ఆ మహిళ తన తల్లిగా పేర్కొంటూ, తండ్రి మరణించిన తర్వాత కుటుంబ బాధ్యతలన్నీ ఆమెనే మోసిందని, తాజాగా ఆమె కూడా చనిపోయిందని హృదయవిదారక కథను అల్లాడు. తల్లి అంత్యక్రియలు నిర్వహించడానికి ఆర్థిక సహాయం కావాలంటూ జీవీ ప్రకాష్‌ను ట్యాగ్ చేస్తూ విజ్ఞప్తి చేశాడు.
ఆ పోస్ట్‌ను చూసిన జీవీ ప్రకాష్, అది నిజమేనని నమ్మి వెంటనే రూ.20,000 ఫోన్‌పే ద్వారా పంపించారు. అయితే డబ్బులు అందుకున్న తర్వాత ఆ వ్యక్తి ఫోన్ కాల్స్ ఎత్తకపోవడంతో అనుమానం మొదలైంది. కొద్దిసేపటికే అసలు నిజం బయటపడింది. గూగుల్‌లో ఇప్పటికే ఉన్న ఆ వృద్ధురాలి ఫోటో, చాలా కాలం క్రితమే మరణించిన వ్యక్తికి సంబంధించినదని నెటిజన్లు గుర్తించారు. సింపథీ కోసం ఆ ఫోటోను దుర్వినియోగం చేసి కథ అల్లినట్లు తేలింది.ఈ విషయం తెలుసుకున్న జీవీ ప్రకాష్, ఆ వ్యక్తిని సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే తాను మోసపోయినట్టు ఆయనకు అర్థమైంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి నకిలీ ప్రచారాల వల్ల నిజంగా ఆపదలో ఉన్నవారికి సాయం అందకపోయే ప్రమాదం ఉందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మానవతా దృక్పథంతో ఎప్పుడూ ముందుండే జీవీ ప్రకాష్ లాంటి వారినే మోసం చేయడం సమాజానికి ప్రమాదకర సంకేతమని పలువురు వ్యాఖ్యానించారు. ఈ మోసానికి పాల్పడ్డ వ్యక్తిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు తమిళనాడు పోలీసులను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఆన్లైన్లో ఎలాంటి సమాచారమైనా నమ్మే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.