GV Prakash-Saindhavi | ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్, సింగర్ సైంధవి వైవాహిక బంధంగా ముగిసింది. ఇద్దరు గత కొద్దిరోజుల కిందట విడిపోతున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా.. విచారణ జరిపిన చెన్నైలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. దాంతో దాదాపు 12 సంవత్సరాల వైవాహిక బంధం ముగిసిపోయింది. ఇద్దరు గతకొంతకాలంగా వేర్వేరుగా ఉంటూ వస్తున్నారు. ఈ ఏడాది మార్చి 24న చెన్నైలోని మొదటి అదనపు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి సెల్వ సుందరి ఆరు నెలల గడువు గడువు ఇచ్చారు. అయితే, సెప్టెంబర్ 25న మరోసారి పిటిషన్ విచారణకు వచ్చింది. జీవీ ప్రకాశ్, సైంధవి ఇద్దరూ స్వయంగా కోర్టుకు హాజరై విడిపోవాలన్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని కోర్టుకు తెలిపారు. ఈ దంపతులకు కుమార్తె ఉంది. ఎవరి వద్ద ఉంటుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. తన సంరక్షణలోనే ఉంటుందని సైంధవి చెప్పగా.. జీవీ ఇందుకు అభ్యంతరం చెప్పలేదు. ఈ క్రమంలో కోర్టు విడాకులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
జీవీ ప్రకాశ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మేనల్లుడు. కోలీవుడ్‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. అలాగే, హీరోగానూ పలు చిత్రాల్లో నటించాడు. తెలుగులోనూ పలు చిత్రాలకు సంగీతం అందించాడు. సైంధవి 12వ సంవత్సరాల వయసులో ఓ టీవీ షో సింగర్‌గా గుర్తింపు పొంది. విక్రమ్ అన్నియన్ (తెలుగులో అపరిచితుడు) చిత్రంతో సినీరంగంలోకి సింగర్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో పాటలు పాడింది. తెలుగులో తొలిసారిగా ఎంఎం కిరవాణి సంగీత దర్శకత్వం వహించిన ‘గంగోత్రి’ సినిమాలో ‘రైలుబండి’ పాటను ఆలపించింది. ఈ తర్వాత నాగార్జున డాన్ సినిమాలో ‘ముద్దే పెట్టు ముద్దేపెట్టు’ సాంగ్‌ను ఆలపించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో పాటలు పడింది.
వాస్తవానికి సైంధవి జీవీ ప్రకాశ్‌కు చిన్ననాటి స్నేహితురాలు. ఇద్దరు దాదాపు 12 సంవత్సరాల పాటు ప్రేమించుకొని 2013 జూన్ 27న పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఓ పాప సైతం ఉన్నది. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని సమాచారం. దాంతో ఇద్దరు విడిపోయాలని నిర్ణయించుకున్నారు. ‘మానసిక ప్రశాంతత, ఇద్దరి జీవితాల్లో మెరుగుకోసం ఒకరికొకరం పరస్పర గౌరవంతో ఈ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటి కీలక తరుణంలో మా గోప్యతకు భంగం కలిగించకుండా ఉండేందుకు మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక నుంచి తాము వేరవుతున్నట్లు అంగీకరిస్తున్నాం. ఈ నిర్ణయం ఇద్దరికీ ఉత్తమమని నమ్ముతున్నాం. ఈ క్లిష్ట సమయంలో మీ అవగాహన, మద్దతు చాలా అవసరం’ గతంలో జీవీ సోషల్ మీడియా పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే.