GV Babu | జబర్ధస్త్ ఫేమ్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం బలగం. చిన్న సినిమాగా విడుదలై ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో నటించిన నటీనటులు మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఈ సినిమా గాయకుడు బలగం మొగిలయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్లోని సంరక్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక్కడ బలగం మూవీలో నటించిన మరో నటుడు అనారోగ్యంతో మంచం పట్టాడు.
ఈ సినిమాలో కొమురయ్య తమ్ముడు అంజన్న పాత్రలో నటించిన జీవీ బాబు ప్రస్తుతం అనారోగ్యంతో ఇబ్బందపడుతున్నాడు. చాలా కాలంగా ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతుండగా, ప్రస్తుతం హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు బాబు కనీసం వైద్య ఖర్చులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాడు బాబు. మందులు కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నాడట. అయితే జీవీ బాబు ఫ్యామిలీ వారి స్థోమతకు తగ్గట్టుగా డబ్బులు కూడబెట్టి వరంగల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అతనికి డయాలసిస్ చేయిస్తున్నారు.
మెరుగైన వైద్యం చేయించలేక కుటుంబం చాలా ఇబ్బందులు పడుతుంది. జీవీ బాబుకి మెరుగైన వైద్యం అందించేందుకు దాతలు, కళాకారులు ఆర్థికసాయం అందించేందుకు ముందుకు రావాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. గతంలో బలగం సినిమా నటుడు, గాయకుడు మొగిలయ్యకి ప్రభుత్వంతో పాటు చిరంజీవి, పలువురు కళాకారులు సాయం చేశారు. మరి ఇప్పుడు వరంగల్ జిల్లా రామన్నపేటకు చెందిన గుడిబోయిన బాబు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుండగా, ఆయనకి ఎవరైన సాయం చేస్తారో చూడాలి. రంగస్థలం నుంచి నటుడిగా గుర్తింపు పొంది, సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు బాబు.