Guntur Kaaram Movie | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం (Guntur Kaaram). శ్రీలీల, మీనాక్షి చౌదరిలు కథానాయికలుగా నటిస్తుండగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సంక్రాంతికి విడుదలవుతున్న భారీ అంచనాలున్న సినిమాల్లో ‘గుంటూరు కారం’ ఒకటి. మహేశ్ – త్రివిక్రమ్ శైలి మాస్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి దమ్ మసాలా బిర్యానీ.. ఎర్ర కారం… అర కోడి అంటూ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయగా.. ఈ పాట సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
గుంటూరు కారం నుంచి సెకండ్ సింగిల్ ఓ మై బేబీ సాంగ్ చిత్రబృందం విడుదల చేసింది. అయితే ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రోల్‌కు గురవుతుంది. ముఖ్యంగా ఈ పాట లిరిక్స్ చెత్తగా ఉన్నాయంటూ లిరిక్ రైటర్ రామ జోగయ్య శాస్త్రిని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ ట్రోల్స్ పై విసుగెత్తిన రామజోగయ్య శాస్త్రి తాజాగా స్పందిస్తూ.. నెటిజన్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.. ప్రతి వాడు మాట్లాడేవాడే రాయి విసిరేవాడే.. అభిప్రాయం చెప్పేదానికి ఒక పధ్ధతి ఉంటుంది.. పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువయ్యిందని.. మీకన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా..అదే లేకపోతే.. ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చెయ్యలేం.. తెలుసుకొని ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడండి.. అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ పోస్ట్ అనంతరం రామజోగయ్య శాస్త్రి తన ఎక్స్ ఖాతాను కూడా డియాక్టివేట్ చేసినట్లు తెలుస్తుంది.