Disha Patani | ఉత్తరప్రదేశ్ బరేలీలో బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి ముందు కాల్పులు చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానిక పోలీసులు స్పష్టం చేశారు. ప్రాథమిక సమాచారం మేరకు ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలిపారు.దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కారణంగానే ఈ దాడి జరిగిందని భావిస్తున్నారు. బాలీవుడ్ మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం, కాల్పులు తామే జరిపామని గోల్డీ బ్రార్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.
మాజీ ఆర్మీ అధికారిణి ఖుష్బూ ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అదే నేపథ్యంలో పటానీ ఇంటిని టార్గెట్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఇక దిశా పటానీ విషయానికి వస్తే 2015లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ చిత్రం పెద్దగా రాణించకపోవడంతో బాలీవుడ్‌పై దృష్టి సారించింది. ఎంఎస్ ధోనీ – ది అన్‌టోల్డ్ స్టోరి, భాగీ వంటి సినిమాలు ఆమెకు గుర్తింపు తెచ్చాయి. చైనీస్ ప్రాజెక్ట్ కుంఫు యోగాలోనూ నటించింది.
తాజాగా తొమ్మిదేళ్ల విరామం తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 ADద్వారా టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇచ్చింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం వెల్కమ్ టు జంగిల్ (హిందీ), హోలీ గార్డ్స్ సాగా (ఇంగ్లీష్) చిత్రాలలో నటిస్తోంది. అయితే దిశా పటానీ ఇంటి ముందు జరిగిన కాల్పుల ఘటన సినీ పరిశ్రమలో ఆందోళన కలిగించింది. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.