Kapil Sharma | కెనడాలోని సర్రే పట్టణంలో ఉన్న ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ యాజమాన్యంలోని కాప్స్ కేఫ్ వద్ద మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈసారి కూడా గుర్తు తెలియని వ్యక్తులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కాల్పుల బాధ్యతను గ్యాంగ్ లీడర్లు గోల్డీ ధిల్లాన్ , కుల్వీర్ సిద్ధు తమ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా స్వీకరించారు. ”నేను, కుల్వీర్ సిద్ధు, గోల్డీ ధిల్లాన్ సర్రేలోని కాప్స్ కేఫ్‌లో జరిగిన మూడు కాల్పులకు బాధ్యత వహిస్తున్నాము” అని వారు పేర్కొన్నారు.
పోస్ట్‌లో .. “మాకు సాధారణ ప్రజలతో ఎలాంటి విభేదాలు లేవు. కానీ మాతో సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి. చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేసే వారు, ఇతరుల డబ్బు తిరిగి చెల్లించని వారు సిద్ధంగా ఉండాలి. బాలీవుడ్లో మతాన్ని అవమానించే వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. బుల్లెట్లు ఎక్కడి నుండైనా రావచ్చు. వాహెగురు జీ కా ఖల్సా, వాహెగురు జీ కి ఫతే” అని హెచ్చరించారు. ఇది కాప్స్ కేఫ్‌పై రెండోసారి జరిగిన దాడి . గత ఆగస్టులో కూడా ఈ కేఫ్‌పై కాల్పులు జరగడంతో కలకలం రేగింది. ఆ సమయంలో దాదాపు 25 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఆ దాడికి కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గోల్డీ ధిల్లాన్ బాధ్యత వహించాడు.
అయితే ఈ గ్యాంగ్‌స్టర్ హెచ్చరిక కేవలం కెనడాకే పరిమితం కాలేదు. వైరల్ అవుతున్న పోస్ట్ లో, “నేను కపిల్ శర్మకు ఫోన్ చేశాను, కానీ అతను రెస్పాండ్ కాలేదు” అని రాసి ఉంది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే, “అతను ఇప్పటికీ రింగ్ వినకపోతే, తదుపరి చర్య ముంబైలో జరుగుతుంది” అంటూ ఆ పోస్ట్‌లో ఉంది.. ఈ బెదిరింపుతో భారతీయ సినీ పరిశ్రమ కూడా భయాందోళనకి గురవుతుంది. ఇలా ఒక నెలలోపే ఇలాంటి దాడి జరగడం పట్ల స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం సర్రే పోలీసులు ఘటన స్థలాన్ని ముట్టడించి దర్యాప్తు చేపట్టారు. ఈ కాల్పుల వెనుక ఉన్న ఉద్దేశం, టార్గెట్ ఎవరు అన్న దానిపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో కెనడా సిక్కు గ్యాంగ్ యాక్టివిటీలు, బాలీవుడ్ వ్యక్తులపై బెదిరింపులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.