Euphoria Movie | ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘యుఫోరియా’ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా గురువారం నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఈటీవీ విన్’లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రేక్షకులపై ఉన్న పూర్తి నమ్మకంతోనే ఈ చిత్రం ‘ధురంధర్’ రేంజ్లో భారీ కమర్షియల్ విజయాన్ని అందుకుంటుందని తాను ఎంతగానో ఆశించానని చెప్పుకొచ్చారు. ఈ సినిమా కేవలం ఒక ప్రాంతానికో లేదా దేశానికో పరిమితమైన అంశం కాదని, ఇది అంతర్జాతీయ స్థాయి కథాంశంతో రూపొందిందని ఆయన వివరించారు. ఈ చిత్రాన్ని మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు త్వరలోనే తమిళం, హిందీ భాషల్లో కూడా ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు గుణశేఖర్ వెల్లడించారు.
అయితే ఈ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడకపోవడానికి చిత్రానికి పెట్టిన ‘యుఫోరియా’ అనే ఆంగ్ల టైటిల్ కూడా ఒక కారణం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా చూసిన తర్వాతే ఆ పేరు ఎందుకు పెట్టామో ప్రేక్షకులకు అర్థమవుతోందని అన్నారు. ప్రస్తుతం చాలా మంది రివ్యూలు చూసి సినిమా బాగుందన్న విషయం తెలుసుకుని, ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసే ధోరణి పెరిగిపోయిందని తెలిపారు. ఈ విషయంలో తాను ప్రేక్షకులను ఏమాత్రం తప్పు పట్టడం లేదని, ప్రేక్షకుల ఆలోచనా విధానంలో వచ్చిన ఈ మార్పుకు చిత్ర పరిశ్రమ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని ఆయన కుండబద్దలు కొట్టారు.
సినిమా విడుదలైన నాలుగు వారాల్లోనే డిజిటల్ ప్లాట్ఫామ్లలోకి తీసుకురావడం వల్లే ప్రేక్షకులు చిన్న సినిమాలను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సినిమాలను థియేటర్లలో చూసి, చిన్న సినిమాలను ఓటీటీలో చూద్దాంలే అనే ధోరణి అందరిలోనూ పెరిగిపోయిందని అన్నారు. కంటెంట్ బాగున్న సినిమాలకు కూడా థియేటర్లలో ఆదరణ దక్కకపోవడం బాధాకరమన్నారు. దీనికి పరిష్కారంగా థియేటర్లలో విడుదలైన తర్వాత కనీసం మూడు నెలల వరకు ఎలాంటి సినిమా అయినా ఓటీటీలోకి రాకుండా పరిశ్రమ పెద్దలు కఠినమైన నిబంధనలు తీసుకురావాలని గుణశేఖర్ డిమాండ్ చేశారు. అలా గ్యాప్ ఇచ్చినప్పుడే కంటెంట్ ఉన్న సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారని, అప్పుడే సినిమా పరిశ్రమ బాగుపడుతుందని ఆయన బలంగా అభిప్రాయపడ్డారు.