Euphoria Trailer | టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రాబోతున్న సామాజిక కథా చిత్రం ‘యుఫోరియా’ (Euphoria). ఈ చిత్రం ఫిబ్రవరి 06న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. నేడు హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక భారీ ఈవెంట్లో ఈ సినిమా ట్రైలర్‌ను అధికారికంగా విడుదల చేసింది చిత్రయూనిట్. ఇటీవల ‘ధురంధర్’ చిత్రంతో హీరోయిన్గా ఆకట్టుకున్న సారా అర్జున్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తుండటం విశేషం. సమాజంలో యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ సమస్యలు, క్రైమ్ నేపథ్యంతో చాలా రా అండ్ ఇంటెన్స్‌గా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుత సమాజంలోని వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా, డ్రగ్స్ మత్తులో యువత తమ జీవితాలను ఎలా చిన్నాభిన్నం చేసుకుంటున్నారనే అంశాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు.
ఈ సినిమాలో సారా అర్జున్‌తో పాటు భూమిక చావ్లా, ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, నాజర్, ఆదర్శ్ బాలకృష్ణ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. వైవిధ్యమైన సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 6, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. భారీ పీరియడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే గుణశేఖర్, తన పంథాను మార్చి తీసిన ఈ ప్రయోగాత్మక చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.