Dhurandhar | ఈ ఏడాది చివర్లో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ (Dhurandhar) సినిమా అంచనాలకు మించి విజయం సాధించి కొత్త రికార్డులను సృష్టించింది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే, అంతర్జాతీయ స్థాయిలో ఒక కీలక మార్కెట్లో మాత్రం ఈ సినిమాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
డిసెంబర్ 5న భారత్‌తో పాటు యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లో ఘనంగా విడుదలైన ఈ చిత్రం, పశ్చిమాసియా (గల్ఫ్ దేశాల్లో) మాత్రం నిషేధానికి గురైంది. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యూఏఈ వంటి దేశాల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు అక్కడి ప్రభుత్వాలు అనుమతించలేదు. పాకిస్థాన్‌కు వ్యతిరేక అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడమే ఈ నిషేధానికి ప్రధాన కారణమని బాలీవుడ్ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. గల్ఫ్ మార్కెట్లో సినిమా విడుదల కాకపోవడం వల్ల సుమారు రూ. 90 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు విదేశీ పంపిణీదారు ప్రణబ్ కపాడియా వెల్లడించారు. “సాధారణంగా గల్ఫ్ దేశాల్లో భారతీయ యాక్షన్ చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది. అక్కడి ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఎంతగానో ఆదరిస్తారని ఆశించాం. కానీ, మా ప్రయత్నాలు ఫలించలేదు. అక్కడ విడుదల కాకపోవడం వల్ల భారీ ఆదాయాన్ని కోల్పోయాం. ఏదేమైనా ఆయా దేశాల నిబంధనలు, అక్కడి ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత మాపై ఉంటుంది” అని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు గల్ఫ్ దేశాల్లో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, ఇతర ప్రాంతాల్లో మాత్రం ‘ధురంధర్’ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. దేశీయ మార్కెట్‌తో పాటు ఇతర విదేశీ మార్కెట్లలో భారీ వసూళ్లను సాధిస్తూ, ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలు, కథాబలం తోడవ్వడంతో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది.