రాగ్ మయూర్ హీరోగా ‘డీజే టిల్లు’ ఫేం విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న విభిన్న కథాచిత్రం ‘అనుమాన పక్షి’. రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మాతలు. నిర్మాణం చివరి దశలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి ‘గులాబ్ జామ్’ సాంగ్‌ను లాంచ్ చేశారు. కిట్టు విస్సాప్రగడ రాసిన ఈ పాటను శ్రీచరణ్ పాకాల స్వరపరచగా, రమణ గోగుల ఆలపించారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
దర్శకుడు విమల్ కృష్ణ మాట్లాడుతూ ‘ఇది పూర్తి వినోదాత్మక చిత్రం. చిన్న సైకలాజికల్ సస్పెన్స్ కూడా ఉంటుంది. పనిచేసిన వారంతా ప్రాణం పెట్టారు. రాగ్ మయూర్ ఈ సినిమాతో స్టార్ అవుతాడు. కచ్చితంగా థియేటర్లలో మంచి ఫన్ రైడ్ ఈ సినిమా’ అని నమ్మకంగా చెప్పారు. ఏ ఇన్స్పిరేషనూ లేని ఒరిజినల్ కంటెంట్‌తో రూపొందుతున్న సినిమా ‘అనుమాన పక్షి’ అని, తన కెరీర్లోనే తొలిదైన ‘గులాబ్ జామ్’ పాటను రమణగోగుల ఆలపించడం ఆనందంగా ఉందని హీరో రాగ్ మయూర్ అన్నారు. ఇంకా సీనియర్ నటి రాశి, హీరోయిన్ మెరీన్లతో పాటు చిత్రబృందమంతా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: సునీల్‌కుమార్ నామా, సహ నిర్మాత: భరత్ లక్ష్మీపతి.