Allu Arjun reached Allu Arvind’s house | ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ నానమ్మ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ (94) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె శనివారం (ఆగస్టు 30) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్, ముంబైలో తన సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, వెంటనే హైదరాబాద్కు వచ్చారు. ప్రస్తుతం అల్లు అరవింద్ ఇంటికి అల్లు అరవింద్ చేరుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
మరోవైపు అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు అల్లు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె భౌతికకాయాన్ని అల్లు అరవింద్ నివాసానికి తరలించగా, ఈరోజు మధ్యాహ్నం కోకాపేటలో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో అల్లు నివాసానికి చేరుకుంటున్నారు. అల్లు కనకరత్నమ్మ దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య సతీమణి. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖకు ఆమె స్వయానా తల్లి. ఈ విషాద సమయంలో మెగా కుటుంబ సభ్యులు కూడా అల్లు అరవింద్ ఇంటికి చేరుకుంటున్నారు.