Ae Devi Varamo Neevu | వైవిధ్యభరితమైన ధారావాహికలతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ వినోద ఛానెల్ ‘స్టార్ మా’ నుండి మరో సరికొత్త సీరియల్ రాబోతోంది. ‘ఏ దేవి వరమో నీవు’ పేరుతో తెరకెక్కిన ఈ సరికొత్త సీరియల్ జూలై 6వ తేదీ నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆల్వాల్‌లోని వీబీఆర్ గార్డెన్స్‌లో ప్రేక్షకులు, అభిమానుల సమక్షంలో ఈ సీరియల్ గ్రాండ్ ప్రీమియర్ లాంచ్ ఈవెంట్‌ను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ‘గుండె నిండా గుడిగంటలు’ సీరియల్ హీరో బాలు ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేయగా, ఎక్స్‌ప్రెస్ హరి తనదైన శైలిలో హోస్టింగ్‌తో అలరించారు. ఈ కార్యక్రమంలో సీరియల్ ప్రధాన పాత్రధారులైన సంజనా గల్రాని, సోనియా, శ్రవణ్‌లతో పాటు భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
ఈ ఈవెంట్లో భాగంగా సీరియల్ మొదటి ఎపిసోడ్‌ను ప్రేక్షకులకు ప్రత్యేకంగా ప్రదర్శించగా, అందులోని భావోద్వేగాలు, నటీనటుల అద్భుత ప్రదర్శనకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. కథ విషయానికి వస్తే.. ప్రేమికుడి చేతిలో మోసపోయి గీతాంజలి అనే యువతి ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. అయితే ఆమె తండ్రి, అన్నయ్య ఆ పాపను తమ వారసురాలిగా అంగీకరించక అనాథ ఆశ్రమంలో వదిలేస్తారు. అక్కడ ‘అంజలి’ అనే పేరుతో పెరిగి పెద్దదైన ఆ అమ్మాయి, అనుకోని పరిస్థితుల్లో తిరిగి తన తల్లి చెంతకే చేరుకోవాల్సి వస్తుంది. మరి గీతాంజలి తన కూతురైన అంజలిని గుర్తుపడుతుందా? తల్లి ప్రేమ కోసం తపించే అంజలికి అమ్మ ఆప్యాయత దక్కుతుందా? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సీరియల్ సాగనుంది. ఈ సరికొత్త కుటుంబ కథా చిత్రం ప్రతి సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ‘స్టార్ మా’ ఛానెల్లో ప్రసారం కానుంది.