జోశర్మ ప్రధాన పాత్రలో మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎమ్4ఎమ్’ (మూటివ్ ఫర్ మర్డర్) చిత్రం ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకొస్తున్నది. ఈ సందర్భంగా బుధవారం కథానాయిక జోశర్మ విలేకరులతో చిత్ర విశేషాలను పంచుకుంది. తాను అమెరికా శాన్ఫ్రాన్సిస్కో నుంచి వచ్చానని, తెలుగులో తనకిది తొలి చిత్రమని, ఇందులో రాధ అనే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తానని చెప్పింది.
ఈ సినిమా విడుదలకు ముందే లాస్ఏంజిల్స్ ఫిల్మ్ ఫెస్టివల్, లండన్ ఫిలిం ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో 15 అవార్డులను గెలుచుకుందని తెలిపింది. ‘ఇదొక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఓ సీరియల్ కిల్లర్.. హత్యలు చేసిన తర్వాత మృతదేహాలను కళాఖండాల తరహాలో డెకరేట్ చేస్తుంటాడు. అతన్ని పట్టుకునే క్రమంలో జరిగే సంఘటనలు ఉత్కంఠను పంచుతాయి. ఇప్పటివరకు భారతీయ సినిమాలో రానటువంటి కాన్సెప్ట్ ఇది’ అని జోశర్మ వివరించింది.