Global Beauty Treasure | మహిళా సాధికారత, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాల పెంపుదలకు వేదికగా నిలుస్తున్న గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ (GBT) సీజన్-3 కర్టెన్ రైజర్ కార్యక్రమం జూలై 12న హైదరాబాద్‌లోని హోటల్ దసపల్లాలో ఘనంగా జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, మోడల్స్, బ్యూటీ క్వీన్స్, పెజెంట్ రంగ నిపుణులు, ఫ్యాషన్ డిజైనర్లు, బ్యూటీ ఇండస్ట్రీ ప్రతినిధులు, కార్పొరేట్ భాగస్వాములు, ప్రముఖ వ్యాపారవేత్తలు, సామాజిక ప్రముఖులు మరియు మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
ఈ సందర్భంగా మిసెస్ ఇండియా ఇంటర్నేషనల్-2022 విజేత, గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ వ్యవస్థాపకురాలు శ్రీమతి సుహాసిని పాండ్యం మాట్లాడుతూ, గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ సీజన్-3 మరో స్ఫూర్తిదాయకమైన ప్రయాణానికి నాంది పలుకుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళల్లో దాగున్న ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే తమ ముఖ్య ఉద్దేశమని, టీమ్ GBT అంకితభావంతో ఈ సీజన్‌ను మరింత విజయవంతంగా, చిరస్మరణీయంగా తీర్చిదిద్దుతుందనే పూర్తి నమ్మకం ఉందని ఆమె పేర్కొన్నారు.
ఈ సీజన్-3 కార్యక్రమానికి ‘ప్రికుస్ డిజిటల్’ (Prikus Digital) స్ట్రాటజిక్ & డిజిటల్ పార్ట్నర్గా వ్యవహరిస్తూ, ఈవెంట్ బ్రాండింగ్, ప్రమోషన్స్, పబ్లిక్ రిలేషన్స్ మరియు నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ఈ నేపథ్యంలో పీలేరు సర్పంచ్ డాక్టర్ షేక్ హబీబ్ పాషా, ప్రికుస్ సీఈఓ ప్రమీల్ అర్జున్, స్కిల్వేధ ఇన్నోవేషన్స్ సీటీఓ సందీప్ అవుటపల్లి, వాసవి ఇన్నోవేషన్స్ అధినేత మెహర్ తేజ, ప్రముఖ రైఫిల్ షూటర్ పి. భువనేశ్వరి, ప్రికుస్ డిజిటల్ బృందంతో పాటు టీమ్ GBT సభ్యులు శ్రీమతి సుహాసిని పాండ్యంకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సీజన్ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఈ కర్టెన్ రైజర్ ఈవెంట్‌తో సరికొత్త అధ్యాయానికి అధికారికంగా శ్రీకారం చుడుతున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.