Govt orders Indian OTT platforms | ఇండో – పాక్ ఉద్రిక్తతలు నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాకిస్థాన్ నటులపై నిషేధం విధించిన భారత ప్రభుత్వం ఓటీటీలపై పడింది. దేశంలోని ఓటీటీ (OTT) వేదికల్లో పాకిస్థాన్‌కు చెందిన పాటలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లు, పాడ్కాస్ట్ల స్ట్రీమింగ్‌ను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారతదేశంలో జరిగిన పలు ఉగ్రదాడుల్లో పాకిస్థాన్‌కు చెందిన ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టం (IT Rules), 2021లోని నిబంధనల ప్రకారమే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తేల్చి చెప్పింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ వేదికలతో పాటు అన్ని మీడియా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, మధ్యవర్తులు పాకిస్థాన్‌కు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు మరియు ఇతర స్ట్రీమింగ్ కంటెంట్‌ను నిలిపివేయాలని ఆదేశించింది. సబ్స్క్రిప్షన్ ద్వారా లేదా ఇతర మార్గాల్లో అందుబాటులో ఉంచినా ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఈ చర్యల వలన గతంలో పాకిస్థాన్-నిర్మిత సినిమాలు, డ్రామాలను ప్రదర్శించిన భారతీయ ఓటీటీ వేదికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను భారతీయ చలనచిత్ర నిర్మాతలు, కళాకారులు స్వాగతించారు.