హాలీవుడ్లో నటించడం గౌరవంగా భావించే భారతీయ నటులు కోకొల్లలు. అందునా.. ‘అవతార్’ లాంటి సినిమాలో అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా?!. కానీ బాలీవుడ్ హీరో గోవిందా వదులుకున్నారట. ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘అమెరికాలో సర్దార్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు. అతనికి బిజినెస్లో ఓ ఐడియా ఇచ్చా. అది బాగా వర్కవుట్ అయ్యింది. దాంతో తను బాగా సంపాదించాడు. ఓ రోజు జేమ్స్ కామెరూన్ దగ్గరకు సర్దార్ నన్ను తీసుకెళ్లాడు. ఆ దిగ్గజ దర్శకుడితో కలిసి డిన్నర్ చేశా.
అప్పుడే ఆయన నాకు ‘అవతార్’ గురించి చెప్పారు. కథను కూడా సూచాయగా వివరించారు. అందులో కీలకమైన ‘స్పైడర్’ పాత్రను నన్ను చేయమన్నారు. 18కోట్లు ఆఫర్ కూడా ఇచ్చారు. 410రోజులు పనిచేయాలని చెప్పారు. నేను కూడా ఓకే అన్నాను. కానీ శరీరానికి పెయింట్ పూసుకొని నటించాలన్నారు. దాంతో ఆ ఆఫర్ని వదులుకున్నా. సినిమా విడుదలయ్యాక.. నాకు ఆఫర్ చేసిన పాత్రలో నటించిన నటుడ్ని చూసి ఆశ్చర్యపోయాను. అంతగొప్ప అవకాశాన్ని మిస్ చేసుకున్నందుకు తెగ బాధపడిపోయా. ఇప్పటికీ ఆ విషయం గుర్తొస్తే.. గుండె బరువుగానే ఉంటుంది.’ అన్నారు గోవిందా.