Salman Khan | గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ వరుస బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్‌ఖాన్‌కి ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. కృష్ణజింకలను వేటాడిన కేసు నేపథ్యంలో సల్మాన్‌ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి పలుమార్లు బెదిరింపులు ఎదురయ్యాయి. రీసెంట్గా సల్మాన్ స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ దారుణహత్యకు గురయ్యారు. దీంతో మళ్లీ లారెన్స్ బిష్ణోయ్ పేరు తెరమీదకు వచ్చింది. దీనికి తగ్గట్టు సల్మాన్‌కు బెదిరింపులు కూడా తీవ్రమవ్వడంతో ఆయనకి భద్రత పెంచినట్టు తెలుస్తున్నది.
అయితే.. సల్మాన్ సూపర్‌స్టార్ కావడంతో, ఇప్పటికే ఒప్పుకున్న కమిట్మెంట్స్ కారణంగా ఆయన ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండలేని పరిస్థితి. అందులో భాగంగానే ఆయన బిగ్‌బాస్ షూట్లో పాల్గొన్నారు. శనివారం ప్రసారమైన ఈ ఎపిసోడ్లో ముందున్నంత యాక్టీవ్‌గా సల్మాన్ కనిపించలేదు. ఆయన ఫేస్‌లో ఆందోళన ప్రస్పుటంగా కనిపిస్తున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
దీనికి తగ్గట్టే కంటెస్టెంట్స్ తప్పొప్పుల గురించి మాట్లాడుతూ సర్కాస్టిగ్గా స్పందించారు సల్మాన్. ‘హౌస్‌లో ఉన్న సభ్యుల భావాలను హోస్ట్‌గా నేను పట్టించుకోకూడదు. నిజానికి నేనిక్కడకు రాకూడదనుకున్నా. రావాలని అనిపించలేదు కూడా. మీతోనే కాదు, ఎవరితో కలవకూడదనుకున్నా. కానీ నా వృత్తి అందుకు అంగీకరించదు. అందుకే రాక తప్పలేదు. వృత్తి పట్ల ఉన్న నిబద్ధత వల్లే ఇక్కడికొచ్చా.’ అన్నారు సల్మాన్. అందుతున్న సమాచారం ప్రకారం 60మంది భద్రతా సిబ్బంది ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌ని పర్యవేక్షిస్తున్నారు. షూటింగ్ స్పాట్లో ఉన్నవాళ్లను బయటకు, బయట వాళ్లను షూటింగ్ స్పాట్‌లోకి అనుమతించడం లేదని సమాచారం.