అనివార్య కారణాల వల్ల ‘అఖండ-2’ సినిమా వారం రోజులు వాయిదా పడిందని, ఈ విషయంలో బాలకృష్ణ అభిమానులకు తమ నిర్మాణ సంస్థ తరపున క్షమాపణలు చెబుతున్నామని, విడుదల తాలూకు సమస్యని పరిష్కరించడంలో మ్యాంగో మీడియా రామ్, నిర్మాత దిల్‌రాజు మద్దతుగా నిలిచారని చిత్ర నిర్మాతలు గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట తెలిపారు. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ-2’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో నిర్మాతలు మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. సినిమాకు అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయని, మౌత్‌టాక్ అద్భుతంగా ఉందని, ఉత్తరాదిన 800 స్క్రీన్లలో విడుదల చేయగా, అక్కడ కూడా వసూళ్లు బాగున్నాయని గోపీచంద్ ఆచంట పేర్కొన్నారు.
తెలుగు రాష్ర్టాల్లో వేసిన ప్రీమియర్స్‌కి 10కోట్ల గ్రాస్ కలెక్షన్స్ లభించాయని, ప్రేక్షకుల నుంచి అంచనాలను మించిన స్పందన లభిస్తున్నదని, వారాంతంలో ఫ్యామిలీ ఆడియెన్స్ వల్ల కలెక్షన్స్ ఇంకా పెరుగుతాయని రామ్ ఆచంట పేర్కొన్నారు.