‘గోదావరిలో పడితే బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ మా ‘గోదారి గట్టుపైన’ ప్రేమలో పడితే బయటకు రావడం కష్టం. అంతగా మీరు సినిమాను ఇష్టపడతారు. ఈ వేసవిలో ఈ సినిమా కూల్ వైబ్స్ ఇస్తుంది’ అన్నారు చిత్ర కథానాయకుడు సుమంత్ ప్రభాస్. ఆయన హీరోగా సుభాష్‌చంద్ర దర్శకత్వంలో రూపొందిన ‘గోదారి గట్టుపైన’ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకురానుంది. నిధి ప్రదీప్ కథానాయిక. సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. రాజు అనే ఆటోడ్రైవర్, అతని ఆటోలో రోజూ ప్రయాణించే ఓ కాలేజీ అమ్మాయి మాయ మధ్య ప్రేమకథ, వారి ప్రయాణంలో ఎదురైన సవాళ్ల నేపథ్యంలో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.
ఈ సందర్భంగా సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ..తాను పుట్టి పెరిగింది తెలంగాణలో అయినా ఈ సినిమా కోసం కోనసీమ యాసను నేర్చుకున్నానని చెప్పారు. సహజత్వం కలబోసిన అందమైన గ్రామీణ ప్రేమకథగా మెప్పిస్తుందని అన్నారు. ఈ వేసవిలో చలివేంద్రంలాంటి సినిమా ఇదని, రియల్ లొకేషన్స్‌లో షూటింగ్ చేశామని దర్శకుడు సుభాష్‌చంద్ర తెలిపారు. సినిమాలోని చివరి 40 నిమిషాలు భావోద్వేగభరితంగా సాగుతాయని నిర్మాత అభినవ్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందమంతా పాల్గొన్నారు.