Actor Darshan | రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటుడు దర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలులో తన జైలు జీవితం గడుపుతున్నాడు. అయితే ఇటీవల విచారణ సందర్భంగా న్యాయమూర్తి ముందు హాజరైన దర్శన్.. జైలులో తన పరిస్థితి గురించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో సౌకర్యాలు సరిగా లేవని, దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయని ఫిర్యాదు చేశారు.
విచారణ కోసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిటీ సివిల్, సెషన్స్ కోర్టుకు హాజరైన దర్శన్.. న్యాయమూర్తి ముందు తన ఆవేదన వ్యక్తం చేస్తూ.. తాను ఉంటున్న జైలు గదిలో తీవ్రమైన దుర్వాసన వస్తోందని, ఫంగస్ సమస్య ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. తాను చాలా రోజులుగా సుర్యుడిని చూడలేదని.. ఇలాంటి పరిస్థితుల్లో బతకడంకంటే నాకు కొంచె విషమివ్వండి అంటూ దర్శన్ న్యాయమూర్తిని వేడుకున్నట్లు సమాచారం.
గతంలో కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు బెయిల్ మంజూరు చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం దర్శన్ బెయిల్‌ను రద్దూ చేయాలంటూ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీంతో సుప్రీంకోర్టు ఈ బెయిల్‌ను రద్దు చేసి, దర్శన్‌ను వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. అంతేకాకుండా చట్టం ముందు అందరూ సమానమేనని.. కస్టడీలో దర్శన్‌కు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం లేదని జైలు అధికారులకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దర్శన్ చేసిన ఫిర్యాదులు చర్చనీయాంశంగా మారాయి.