తెలుగు సినీ సంగీత సామ్రాజ్యాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన అమరగాయకుడు, దిగ్గజ సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’. అన్యుక్త్ రామ్ పిక్చర్స్ బ్యానర్‌పై సి.హెచ్. ఫణి నిర్మించగా, సి.హెచ్. రామారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. ఘంటసాల గారి గళం ప్రతి తెలుగు గుండెలో మారుమోగుతూనే ఉంటుంది, కానీ ఆయన వ్యక్తిత్వం వెనుక ఉన్న కష్టం ఎంత? ఈ సినిమా ఆ ప్రశ్నలకు సమాధానంగా నిలిచిందా? రివ్యూలో చూద్దాం.
కథ
ఘంటసాల గారి పాట అందరికీ తెలుసు, కానీ ఆయన ‘మాట’ వెనుక ఉన్న సంస్కారం, ‘బాట’లో ఉన్న కష్టాలు చాలా మందికి తెలియవు. ఈ సినిమా ఆయన బాల్యం నుండి మొదలవుతుంది. సంగీతం నేర్చుకోవడం కోసం విజయనగరంలో జోలె పట్టి అడుక్కున్న రోజులు. మద్రాసులో అవకాశాల కోసం పార్కుల్లో, ఫుట్‌పాత్‌లపై పడుకున్న కఠిన పరిస్థితులు.. ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగి తెలుగు చిత్ర పరిశ్రమకు గళంగా మారిన ప్రయాణాన్ని దర్శకుడు హృద్యంగా చూపించారు. అయితే, శిఖరాగ్రాన ఉన్న సమయంలో ఆయనను వేధించిన లోటు ఏమిటి? ఆయన చివరి రోజుల్లో భగవద్గీత ఆలాపన వెనుక ఉన్న వేదన, ఆయన చివరి కోరిక తీరిందా లేదా? అనే అంశాలు క్లైమాక్స్‌లో కన్నీళ్లు పెట్టిస్తాయి.
నటీనటులు
ఈ సినిమాకు ప్రధాన బలం కృష్ణ చైతన్య. ఘంటసాల గారి యవ్వన దశలోనూ, అవసాన దశలోనూ ఆయన ఆహార్యం, నడక, హావభావాలను కృష్ణ చైతన్య అద్భుతంగా పండించారు. కొన్ని సీన్లలో సాక్షాత్తూ ఘంటసాల గారే ఉన్నారేమో అన్నంతగా పరకాయ ప్రవేశం చేశారు. ఘంటసాల సతీమణి పార్వతమ్మ పాత్రలో మృదుల గారు చాలా హుందాగా నటించారు. హిందుస్తానీ గాయకుడు బడే గులాం అలీ ఖాన్‌గా సుమన్ గారు తన పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. పట్రాయని సీతారామశాస్త్రిగా సుబ్బరాయ శర్మ, సముద్రాలగా జె.కె. భారవి వంటి వారు తమ అనుభవంతో పాత్రలకు జీవం పోశారు.
🎬 సాంకేతిక విశ్లేషణ
దర్శకుడు సి.హెచ్. రామారావు ఒక మహనీయుడి కథను చెప్పడంలో చూపిన చిత్తశుద్ధి ప్రశంసనీయం. ఘంటసాల సినిమా అంటే సంగీతమే ప్రాణం. ఈ చిత్రంలో ఒరిజినల్ సాంగ్స్‌ను వాడటం, నేపథ్య సంగీతం ఆ కాలపు మూడ్‌ని తీసుకురావడం పెద్ద ప్లస్. పాత కాలపు వాతావరణాన్ని ప్రతిబింబించేలా కెమెరా వర్క్ బాగుంది. బడ్జెట్ పరిమితుల వల్ల కావచ్చు, గ్రాఫిక్స్ మరియు ఆర్ట్ వర్క్ కొన్ని చోట్ల నాసిరకంగా అనిపిస్తాయి. సెట్టింగ్స్ రియలిస్టిక్‌గా లేకపోవడం సినిమా ఫ్లోను కొంచెం దెబ్బతీసింది.
ప్లస్ పాయింట్స్:
ఘంటసాల గారి జీవితంలోని తెలియని కోణాలు.
కృష్ణ చైతన్య నటన.
హృదయాన్ని కదిలించే క్లైమాక్స్.
పాత తరం సంగీత దిగ్గజాల ప్రస్తావన.
మైనస్ పాయింట్స్:
పేలవమైన గ్రాఫిక్స్.
ఆర్ట్ వర్క్ లో లోపాలు.
చివరిగా ‘ఘంటసాల ది గ్రేట్’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అది తెలుగు జాతి గర్వించదగ్గ ఒక గొప్ప గాయకుడికి ఇచ్చిన నివాళి. సాంకేతికంగా కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ, ఘంటసాల గారి పాటను ప్రేమించే ప్రతి తెలుగువాడు తప్పక చూడాల్సిన, తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది. ఈ వారాంతంలో కుటుంబంతో కలిసి చూడదగ్గ ఒక క్లీన్ అండ్ ఎమోషనల్ బయోపిక్.
రేటింగ్: 2.75 / 5