Ghaati | టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి. హీరోల సరసన నటిస్తూనే లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో తన దైన నటతో ఎంతగానో అలరించింది. బాహుబలితో అనుష్కకి మంచి స్టార్డమ్ దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. కాని ఆ తర్వాత సినిమాల సంఖ్య తగ్గించింది.అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు అనుష్క చేస్తున్న తాజా చిత్రం ఘాటీ. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రారంభ దశ నుంచే మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. ‘వేదం’, ‘కంచె’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ లాంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న క్రిష్ – అనుష్క కలయికపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో , రాజీవ్ రెడ్డి మరియు సాయిబాబా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ‘ఘాటీ’ను మొదట ఏప్రిల్ 18 న విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళిక వేసినప్పటికీ, షూటింగ్ ఆలస్యం కారణంగా అప్పటికి విడుదల కాలేకపోయింది. తదుపరి, జులై 11 న సినిమా విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. షూటింగ్ పూర్తవడం, ప్రచార కార్యక్రమాలు మొదలవడం చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) పనులు పూర్తి కాకపోవడంతో మళ్లీ వాయిదా పడింది.
అయితే సినిమా విజువల్ స్టాండర్డ్స్‌ను అత్యున్నతంగా చూపించాలన్న ఉద్దేశంతో నాణ్యతపై రాజీ పడకుండా గ్రాఫిక్స్ పనులను జాగ్రత్తగా పూర్తిచేస్తున్నామని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.తాజాగా ఘాటీ మేకర్స్ గుడ్ న్యూస్ ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ తేది, ట్రైలర్ ఆగస్ట్ 6 బుధవారం ప్రకటించనున్నట్టు తెలియజేశారు. మీ నిరీక్షణ ముగించే సమయం ఆసన్నమైంది. త్వరలో ఆమె పాలన ప్రారంభం అవుతుందంటూ తెలియజేశారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనుష్క మళ్లీ మ్యాజిక్ చేస్తుందా? క్రిష్ చూపించే విజువల్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంటుందో త్వరలోనే తెలుస్తుంది.