Genelia | ‘బాయ్స్’ సినిమాతో తెలుగు సినీ ప్రపంచంలో అడుగుపెట్టి, ‘బొమ్మరిల్లు’ హాసినిగా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన అందాల తార జెనీలియా. బొమ్మరిల్లు చిత్రం ఆమెని తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గర చేసింది. ‘సత్యం’, ‘సై’, ‘హ్యాపీ’ వంటి చిత్రాలలో నటనపరంగా ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తరువాత ‘ఢీ’, ‘రెడీ’, ‘కొత్త బంగారు లోకం’ వంటి హిట్ చిత్రాల్లో నటించిన జెనీలియా, తన కెరీర్ పీక్‌లో ఉండగానే సినిమాలకు గుడ్‌బై చెప్పేసి వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇచ్చింది. 2012లో వచ్చిన ‘నా ఇష్టం’ సినిమా తర్వాత వెండితెరకు దూరమైంది. బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకుని కొన్నేళ్ల పాటు వైవాహిక జీవితానికి ఎక్కువ ప్రధాన్యత ఇచ్చింది. ఇప్పుడు తిరిగి నటనపై దృష్టి పెట్టింది.
ఇటీవల అమీర్ ఖాన్‌తో కలిసి ‘సితారే జమీన్ పర్’ అనే చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన జెనీలియా, ప్రస్తుతం ‘జూనియర్’ అనే సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఆమె ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటి నుంచి నేను ప్రాధాన్యత ఉన్న పాత్రలకే సైన్ చేస్తాను. అవసరమైతే ఆ పాత్రల కోసం ఆడిషన్స్ ఇచ్చేందుకు కూడా సిద్ధం అంటూ జెనీలియా పేర్కొంది.
ఇండస్ట్రీలోకి రావడం బొమ్మరిల్లులో హాసినిగా, హ్యాపీలో మధుమతిగా పాత్రలు చేయడం, ప్రేక్షకుల నుంచి విశేషమైనటువంటి అభిమానాలు పొందడం నాకు ఒక డ్రీమ్ లాగా అనిపిస్తుంది. ఇక టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ నా ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన ప్రతిభ ఉన్న హీరోలు వారు. ఇప్పుడు వారిని సూపర్ స్టార్స్ గా చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు. మూడు పేజీల డైలాగ్ కూడా ఒకేసారి చెప్పేస్తాడు. అలాంటి నటుడిని ఇంతవరకు చూడలేదు. ఇక రామ్ చరణ్ కూడా అద్భుతమైన నటుడు అని ప్రశంసించిన జెనీలియా.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అద్భుతంగా ప్రదర్శన కనబరిచినట్టు పేర్కొంది. ఇక అల్లు అర్జున్‌లో మంచి ఎనర్జీ ఉంటుందని స్పష్టం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక రితేష్ తో మజిలీ రీమేక్ చేశాను. అది అద్భుతమైన విజయాన్ని ఇచ్చింది. మరో మంచి లవ్ స్టోరీ కుదిరితే సినిమా చేయాలని ఆలోచన అయితే ఉంది అని పేర్కొంది జెనీలియా.