‘ఆహా’ ఓటీటీలో సింగింగ్ షో ‘తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4’ ప్రేక్షకుల్ని అలరిస్తున్నది. ఈ సీజన్లో టాప్ 12 కంటెస్టెంట్స్‌కు సంబంధించిన ఎపిసోడ్స్‌ను ఈ నెల 12 నుంచి ప్రతి శుక్రవారం, శనివారం స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకులు తమన్, గాయకులు కార్తీక్, గీతామాధురి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. బుధవారం సీజన్ 4 స్పెషల్ స్క్రీనింగ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తమన్ మాట్లాడుతూ..ఆరు వేల కంటెస్టెంట్స్ నుంచి 12 మందిని ఎంపిక చేయడం అంటే ఎంత పోటీ ఉందో అర్థం చేసుకోవచ్చని, ఈ షో తనను ప్రేక్షకులకు మరింతగా చేరువ చేసిందని అన్నారు.
అమెరికా, ఆస్ట్రేలియాలో కూడా దీనిని ఆర్గనైజ్ చేయబోతున్నామని, అందుకే గల్లీ టూ గ్లోబల్ అనే క్యాప్షన్‌ను పెట్టామని తమన్ తెలిపారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘ఇండియన్ ఐడల్ వారికి ప్రతి సీజన్‌కు డబ్బులిచ్చి హక్కులు తీసుకోవాల్సి ఉంటుంది. గత సీజన్ కంటే నాలుగో సీజన్ బాగా చేస్తున్నారు. తమన్ ఈ షోకు లైఫ్‌ను తీసుకొచ్చారు. అమెరికాలో ఈ ప్రోగ్రామ్ చూస్తూ అక్కడి నుంచి కంటెస్ట్ చేసేందుకు వచ్చారంటే ఈ షో క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇది గల్లీ టూ గ్లోబల్ అయింది’ అన్నారు. ఈ కార్యక్రమంలో సింగర్స్ సమీరా భరద్వాజ్, గీతామాధురి పాల్గొన్నారు.