Fida | తెలుగు ప్రేక్షకుల మదిలో బోల్డ్ నాయికగా గుర్తింపు తెచ్చుకుంది నటి గాయత్రి గుప్తా.ఈ అమ్మడు సినిమాల కన్నా కూడా వివాదాలతోనే వార్తలలో నిలుస్తుంటుంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎక్కువగా కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ అవుతుంటుంది. తాజాగా సందీప్ రెడ్డి వంగా గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. గాయత్రి మాట్లాడుతూ, “నాకు ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రి పాలయ్యాను. అప్పట్లో క్రౌడ్ ఫండింగ్ ద్వారా సాయం కోరాను. రూ.15 లక్షలు అవసరం కాగా, కేవలం రూ.2 లక్షలు మాత్రమే వచ్చాయి.
అదే సమయంలో నేను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకి మెసేజ్ చేసాను. ఆయన ‘ఫిదా’ టైంలో నా యాక్టింగ్ మెచ్చుకున్నారు. అప్పటినుంచి మంచి ఫ్రెండ్ అయ్యారు. అయితే ఆయనకి అనారోగ్య పరిస్థితిని వివరించాను. వెంటనే రిప్లై ఇస్తూ, నా మెడికల్ రిపోర్ట్స్ పంపమన్నాడు. పంపించాక, ఎంత అవసరం అనడిగాడు. నేను పంపిన చిన్న లిస్ట్ చూసి, ఒక వారం రోజుల్లోనే రూ.5.5 లక్షలు పంపించాడు. నన్ను కలవలేదు, ఏ విధంగా కూడా ఒత్తిడి చేయలేదు. కేవలం నా బాధను అర్థం చేసుకుని డబ్బు పంపించాడు. అప్పటి దయనీయ పరిస్థితుల్లో ఆయన చేసిన సహాయం ఎప్పటికీ మరిచిపోలేను అని భావోద్వేగంగా తెలిపింది గాయత్రి.
అనారోగ్యం సమయంలో చికిత్స కోసం బెంగళూరుకు వెళ్లిన గాయత్రి, యోగా, బ్రీత్ వర్క్ఔట్స్, పంచకర్మల ద్వారా కోలుకున్నట్టు వెల్లడించారు. “డాక్టర్లు నువ్వు ఎక్కువ కాలం బతకలేవని చెప్పారు. నా ఫ్యామిలీ కూడా పట్టించుకోలేదు. నా కష్ట కాలంలో ఎవ్వరూ సహాయం చేయలేదు. అందుకే నా జీవితంలో నాకు అవసరంలేని వాళ్లను వదిలించుకున్నా. ఇప్పుడెవరైనా మిగిలి ఉంటే, నిజంగా నాకు అవసరమైనవాళ్లే. ఈ జర్నీలో దేవుడు పరిచయమయ్యాడు, అదే నాకు నిజమైన గిఫ్ట్” అంటూ గాయత్రి గుప్తా భావోద్వేగంతో చెప్పారు. సందీప్ రెడ్డి వంగా చేసిన సహాయంపై నెటిజన్లు పొగడ్తలు కురిపిస్తున్నారు. సింపుల్ మెసేజ్‌కే ఇంత పెద్ద హెల్ప్ చేయడం గొప్ప విషయం , సందీప్ వంగా నిజమైన మానవతావాది అంటూ కామెంట్లు పెడుతున్నారు.