ముంబై: అందాల భామ ఆలియా భట్ నటించిన గంగూభాయ్ కతియావాడి చిత్రాన్ని బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివ్‌లో ప్రదర్శించనున్నారు. మేటి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తీస్తున్న విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నుంచి జరగబోయే బెర్లిన్ ఫెస్టివల్లో గంగూభాయ్ చిత్ర ప్రీమియర్ షోను నిర్వహించనున్నారు. బెర్లిన్ షోకు ఎంపికైన ఏకైక ఇండియన్ సినిమా ఇదే అని నిర్వాహకులు తెలిపారు. ముంబైలో మాఫియా క్వీన్‌గా ఎదిగిన గంగూభాయ్ కథ ఆధారంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1960 దశకంలో కామటిపురా రెడ్‌లైట్ ఏరియాలో గంగూభాయ్ ఓ పవర్ఫుల్ వ్యక్తిగా ఆ ప్రాంతాన్ని ఏలింది. హుస్సేన్ జైదీ రాసిన పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2019లోనూ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆలియా నటించిన గల్లీ భాయ్ చిత్రానికి ప్రీమియర్ షో నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన గంగూభాయ్ కతియావాడి చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.