Pushpa | దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బొజ్జ గణపయ్యకు భక్తులు ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రతి ఏడాది వినాయక విగ్రహాలను వినూత్నంగా రూపొందించడం ఇప్పుడు సాధారణమైపోయింది. సినీ ప్రభావంతో గణేశుడిని ప్రముఖ హీరోల గెటప్ల్లో ప్రతిష్ఠించడం నేటి ట్రెండ్ అయింది. ఈ తరహాలోనే తమిళనాడు హోసూరులో ఏర్పాటు చేసిన ఓ గణేశ మండపం ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప 2 సినిమాను తలపించేలా ఓ భారీ మండపం ఏర్పాటు చేయగా, ఇందుకోసం నిర్వాహకులు సుమారు ₹30 లక్షల ఖర్చు చేసినట్లు సమాచారం.
ఈ మండపం చూసినవారికి ఓ సినిమా సెట్లోకి వెళ్లిన ఫీలింగ్ వస్తుంది. ఎంట్రెన్స్ వద్దే హెలికాప్టర్ పక్కన గన్‌తో నిలబడి ఉన్న పుష్ప రాజ్ విగ్రహం దర్శనమిస్తోంది. తర్వాత ఎర్రచందనం దుంగల మధ్య నుండి లోపలికి వెళ్లితే, గంగమ్మ జాతర ఫైట్ కాస్ట్యూమ్ లో అల్లు అర్జున్ గెటప్‌ను పోలిన గణేశ విగ్రహం ఉంటుంది. ఇది కేవలం విగ్రహమే కాదు, సినీ అభిమానులకు ఒక కల్చరల్ ఎక్స్పీరియన్స్ లా మారింది. ఈ మండపానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మండపంలో పుష్ప 2కి సంబంధించిన స్టిల్స్ కూడా ప్రదర్శనకు ఉంచారు. అక్కడికి వచ్చినవారంతా ఈ సెట్‌ను ఆసక్తిగా తిలకిస్తున్నారు.
ఒక్కవైపు కొందరు నెటిజన్లు దీనిని ఒక కళాత్మక ఆవిష్కరణగా అభివర్ణించగా, మరికొందరు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘దేవుడిని సినిమా పాత్రలతో మేళవించడం సరిగ్గా కాదు’’, ‘‘ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి’’ అని విమర్శిస్తున్నారు. ఈ ఘటన ఒకవైపు సాంస్కృతిక వినూత్నతకు నిదర్శనంగా నిలుస్తున్నప్పటికీ, మరోవైపు సాంప్రదాయాలను ఉల్లంఘిస్తున్నారా? అనే ప్రశ్నను కూడా లేవనెత్తింది. ఇక అల్లు అర్జున్‌కి పుష్ప ఫ్రాంచైజీ చిత్రాలతో ఎంత క్రేజ్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉంటుందని టాక్.
Finally Darshanam Completed 👍 pic.twitter.com/QYYjb9PpKM
— Chennai Murug🅰️🅰️n (@ChennaiMurugAAn) August 28, 2025