Gandhi Tatha Chettu | టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకుమార్ గారలపట్టి సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు (Gandhi Tatha Chettu). ఈ సినిమా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పాటు, రామ్ చరణ్ తదితర సినీ ప్రముఖులు చిత్రంపై ప్రశంసలు కురిపించారు. అయితే ఈ సినిమా విడుదలై రెండు నెలలు గడుస్తున్న ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు. ఇదిలావుంటే ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా తాజాగా ఓటీటీలో ప్రత్యక్షమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో(Gandhi Tatha Chettu On Prime Video)లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుకృతి వేణి బండ్రెడ్డితో పాటు ఆనంద చక్రపాణి, రాగ్ మయూర్, రఘురామ్, భాను ప్రకాశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన రామచంద్రయ్య (ఆనంద చక్రపాణి) గాంధేయవాది. చిన్నతనం నుంచే తన తండ్రిని చూసి దేశభక్తిని పెంచుకుంటాడు. గాంధీ అంటే విపరీతమైన ఇష్టమున్న రామచంద్రయ్య తన కొడుకు కూతురు(మనవరాలు)కి కూడా గాంధీ (సుకృతి వేణి) అని పేరు పెడతాడు. గాంధీ కూడా తన తాతా లాగే సత్య మార్గంలో నడుస్తుంటుంది. అయితే రామచంద్రయ్యకు 15 ఎకరాల భుమి ఉంటుంది. అందులోనే ఉన్న ఓ పెద్ద వేప చెట్టు అంటే అతనికి ప్రాణం. అయితే అక్కడున్న స్థానిక మంత్రి చేసిన కుట్ర వలన ఊర్లో ఉన్న చెరకు ఫ్యాక్టరీ మూత పడుతుంది. దీంతో చెరుకు వేసిన రైతులంతా నష్టపోయి అప్పులపాలవుతారు. ఈ క్రమంలోనే ఈ ఊరిలో కెమికల్ ఫ్యాక్టరీ పెట్టి ఉపాధి ఇస్తానని వ్యాపారవేత్త సతీష్(రాగ్ మయూర్) రైతులను మభ్యపెడతాడు. సతీష్ డబ్బు ఆశ చూపడంతో పంట పొలాలన్ని సతీష్‌కి అమ్మేస్తారు. అయితే రామచంద్రయ్య మాత్రం తన భుమిని అమ్మేస్తే.. తనకు ప్రాణమైన వేప చెట్టుని నాశనం చేస్తారు అనే భయంతో భుమిని అమ్మేందుకు నిరాకరిస్తాడు. దీంతో రామచంద్రయ్యకు తన కొడుకుకు మధ్య విభేదాలు తలెత్తుతాయి. అయితే పారిశ్రామిక వేత్త రాకతో గాంధీ కుటుంబంలో చోటు చేసుకొన్న పరిస్థితి ఏమిటి? తాత కోసం తండ్రితో గాంధీ ఎందుకు విభేదించింది? తాత రామచంద్రయ్యకు గాంధీ ఇచ్చిన మాట ఏమిటి? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.