మూవీ: గాంధీ తాత చెట్టు
నటీనటులు: సుకృతి వేణి బండ్రెడ్డి, ఆనంద చక్రపాణి, రాగ్ మయూర్, రఘురామ్, భాను ప్రకాశ్ తదితరులు
రచన, దర్శకత్వం: పద్మావతి మల్లాది
నిర్మాతలు: శ్రీమతి తబితా సుకుమార్ సమర్పకురాలు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు
సహ నిర్మాతలు: అశోక్ బ్రండ్రెడ్డి, అభినయ్ చిలుకమర్రి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ, కాసర్లశ్యామ్, విశ్వ
రిలీజ్ డేట్: 2025-01-24
Gandhi Tatha Chettu | అగ్ర దర్శకుడు సుకుమార్, శ్రీమతి తబితా సుకుమార్ దంపతుల కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు (Gandhi Tatha Chettu). ఈ సినిమా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటనకు గాను దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, దాదా సాహెబ్ ఫాల్కే, ఇండియన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ తొలి సినిమా బాలనటిగా సుకృతి వేణి బండ్రెడ్డి అవార్డు అందుకుంది. అయితే ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో పాటు సినిమా ప్రముఖలకు ప్రత్యేక ప్రివ్యూ ప్రదర్శించారు. అయితే ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ
నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన రామచంద్రయ్య (ఆనంద చక్రపాణి) గాంధేయవాది. చిన్నతనం నుంచే తన తండ్రిని చూసి దేశభక్తిని పెంచుకుంటాడు. గాంధీ అంటే విపరీతమైన ఇష్టమున్న రామచంద్రయ్య తన కొడుకు కూతురు(మనవరాలు)కి కూడా గాంధీ (సుకృతి వేణి) అని పేరు పెడతాడు. గాంధీ కూడా తన తాతా లాగే సత్య మార్గంలో నడుస్తుంటుంది. అయితే రామచంద్రయ్యకు 15 ఎకరాల భుమి ఉంటుంది. అందులోనే ఉన్న ఓ పెద్ద వేప చెట్టు అంటే అతనికి ప్రాణం. అయితే అక్కడున్న స్థానిక మంత్రి చేసిన కుట్ర వలన ఊర్లో ఉన్న చెరకు ఫ్యాక్టరీ మూత పడుతుంది. దీంతో చెరుకు వేసిన రైతులంతా నష్టపోయి అప్పులపాలవుతారు. ఈ క్రమంలోనే ఈ ఊరిలో కెమికల్ ఫ్యాక్టరీ పెట్టి ఉపాధి ఇస్తానని వ్యాపారవేత్త సతీష్(రాగ్ మయూర్) రైతులను మభ్యపెడతాడు. సతీష్ డబ్బు ఆశ చూపడంతో పంట పొలాలన్ని సతీష్‌కి అమ్మేస్తారు. అయితే రామచంద్రయ్య మాత్రం తన భుమిని అమ్మేస్తే.. తనకు ప్రాణమైన వేప చెట్టుని నాశనం చేస్తారు అనే భయంతో భుమిని అమ్మేందుకు నిరాకరిస్తాడు. దీంతో రామచంద్రయ్యకు తన కొడుకుకు మధ్య విభేదాలు తలెత్తుతాయి. అయితే పారిశ్రామిక వేత్త రాకతో గాంధీ కుటుంబంలో చోటు చేసుకొన్న పరిస్థితి ఏమిటి? తాత కోసం తండ్రితో గాంధీ ఎందుకు విభేదించింది? తాత రామచంద్రయ్యకు గాంధీ ఇచ్చిన మాట ఏమిటి? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..?
గాంధీ సిద్ధాంతాలను, ఆయన బాటను అనుసరించే ఓ పదమూడేళ్ల అమ్మాయి కథ ఇది. పుట్టిన ఊరినే విడిచివెళుతున్న ఈ రోజుల్లో ఒక అమ్మాయి తన ఊరి కోసం తన తాత కోసం ఏం చేసింది అనేది సినిమా. ఈ సినిమా టైటిల్‌కు తగ్గట్లుగానే ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ గాంధీ పాత్ర. ఆ పాత్రను సుకృతి అలవోకగా పోషించింది. ముఖ్యంగా కీలక సన్నివేశాల్లో అనుభవం ఉన్న నటిలా నటించి అందరిని మెప్పించింది.
దర్శకురాలు ఎంచుకున్న కథ బాగున్నప్పటికి కొంచెం లాగ్ ఉండడం సినిమాకు నిరాశ కలిగించేలా ఉంది. మరోవైపు ఈ సినిమాకు రామచంద్రయ్య గాంధేయవాదిగా, ప్రకృతి ప్రేమికుడిగా తన క్యారెక్టరలో ఒదిగిపోయాడు. స్క్రీన్‌పై ఆయన ప్రజెన్స్ బాగుంది. తాతకి మనవరాలికి మధ్య సన్నివేశాలు కూడా ఎమోషనల్‌గా వర్కవుట్ అయ్యాయి.
టెక్నికల్‌గా
దర్శకురాలు పద్మావతి మల్లాది ఒకపక్క గాంధీ జర్నీని చూపిస్తూనే.. మరోపక్క తాత, చెట్టుకు మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించారు. పకృతి యొక్క ప్రాముఖ్యత గురించి చెబుతూ.. అహింసవాదం గొప్పదనాన్ని ఎంటర్టైనింగ్గా చెప్పారు. అలాగే శ్రీజిత, విశ్వ అందించిన సినిమాటోగ్రఫి.. రూరల్ బ్యాక్‌డ్రాప్‌ని కెమెరాలో బంధించిన తీరు బాగుంది. ముఖ్యంగా తెలంగాణ గ్రామల్లో ఉండే యాసలో రాసిన డైలాగ్స్ ఈ సినిమాకు ప్లస్ అని చెప్పవచ్చు.
రేటింగ్ : 2.75/5