Game Changer | రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘గేమ్‌చేంజర్’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నట్టు నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్‌ని కొత్త పుంతలు తొక్కించనున్నారు దిల్‌రాజు.
ఇప్పటివరకూ పాటలే తప్ప ‘గేమ్‌చేంజర్’కి సంబంధించిన ట్రైలర్, టీజర్ విడుదల కాలేదు. అందుకే త్వరలో ఈ సినిమా టీజర్‌కి ప్లాన్ చేశారు దిల్‌రాజు. టీజర్ కట్ చేయడం కూడా పూర్తయిందని సమాచారం. మంచి ముహూర్తం చూసి త్వరలో టీజర్‌ని విడుదల చేయనున్నారు. శంకర్ బ్లాక్‌బస్టర్స్ భారతీయుడు, ఒకేఒక్కడు తరహాలో సామాజిక సమస్యల నేపథ్యంలో ‘గేమ్‌చేంజర్’ కథ కూడా సాగుతుందని సమాచారం.
సమాజంలోని ప్రతి ఒక్కరికీ రాజ్యాంగంపై, పాలనా వ్యవస్థపై అవగాహన కలిగించేలా ఈ సినిమాలో సన్నివేశాలుంటాయని, బంధాలు, భావోద్వేగాలు, వెన్నుపోటు రాజకీయాలు, పగ, ప్రతీకారాల నేపథ్యంలో సినిమా ఉంటుందని వినికిడి. రామ్‌చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో అంజలి, కియారా అద్వానీ కథానాయికలు. శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, సునీల్ తదితరులు ఇతరపాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: ఎస్.ఎస్.థమన్.