Game Changer | నితిన్ ప్రధాన పాత్రలో వేణు శ్రీరామ్ తెరకెక్కించిన చిత్రం తమ్ముడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు శ్రీవెంకటేశ్వర బేనర్‌పై నిర్మించారు. జూలై 4న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. హీరో హీరోయిన్స్‌తో పాటు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌లు కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం గురించి నిర్మాత శిరీష్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల టాలీవుడ్లో పెద్ద వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శిరీష్ స్వయంగా స్పందించి, ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు.
ఓ ఇంటర్వ్యూలో శిరీష్ మాట్లాడుతూ, “గేమ్ ఛేంజర్ విడుదల తర్వాత హీరో రామ్ చరణ్ గానీ, డైరెక్టర్ శంకర్ గానీ కనీసం ఫోన్ చేయలేదు. నష్ట నివారణ చర్యల గురించి మాట్లాడలేదు అని వ్యాఖ్యానించడంతో, ఈ మాటలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై మెగా అభిమానులు తీవ్రంగా స్పందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. “చరణ్ పూర్తి సహకారం అందించినా, ఇలా మాట్లాడటం సరైంది కాదు అంటూ ట్రోల్ చేశారు. ఈ పరిస్థితిని గమనించిన శిరీష్ వెంటనే స్పందించారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే అది ఉద్దేశపూర్వకమైంది కాదని స్పష్టం చేస్తూ, ఓ బహిరంగ లేఖ ద్వారా క్షమాపణలు తెలిపారు.
“గేమ్ ఛేంజర్ షూటింగ్ సమయంలో రామ్ చరణ్ తన పూర్తి సమయాన్ని కేటాయించి, అన్నివిధాలా సహకరించారు. చరణ్ గారితో, చిరంజీవి గారి కుటుంబంతో మాకు ఎంతో కాలంగా మంచి అనుబంధం ఉంది. నా మాటలు ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే, హృదయపూర్వకంగా క్షమించండి” అని ఆయన పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ గారి ప్రతిష్ఠను కించపరచే ఉద్దేశం నాకు ఎప్పటికీ లేదు. నా వ్యాఖ్యలు కొన్ని సందర్భాల్లో తప్పుగా అర్థమయ్యాయి అంటూ వివరణ ఇచ్చారు. వివాదం మరింత పెరిగకుండా శిరీష్ బహిరంగంగా స్పందించడం వల్ల మెగా అభిమానుల్లోనూ, ఇండస్ట్రీలోనూ శాంతి వాతావరణం నెలకొంది.