Gam Gam Ganesha | టాలీవుడ్ యువ నటుడు ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘గం..గం..గణేశా’ (Gam Gam Ganesha). ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, రాజ్ అర్జున్, సత్యం రాజేష్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ఉదయ్ శెట్టి ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. గణేశ్ (ఆనంద్ దేవరకొండ) ఒక అనాథ. తన స్నేహితుడు ఇమాన్యూయల్తో కలిసి చిన్నప్పటినుంచే దొంగతనాలు చేయడం మొదలు పెడతాడు. మరోవైపు శ్రుతి (నయన్ సారిక)తో ప్రేమలో ఉంటాడు. అయితే శ్రుతి మాత్రం తనకు బెటర్ ఆప్షన్ దొరకగానే గణేశ్‌ని వదిలి వెళ్లిపోతుంది. అయితే ఈ క్రమంలోనే గణేష్ అనుకోకుండా ఒక డైమండ్‌ను దొంగతనం చేస్తాడు. ఆ డైమండ్ కోసం ఒక గ్యాంగ్ గణేష్ వెంటపడుతుంది. ఈ క్రమంలో ఆ డైమండ్ కోసం గణేశ్ ఏం చేశాడు ?, అసలు ఆ డైమండ్ ముంబై నుంచి తెస్తున్న గణేశ్ విగ్రహంలోకి ఎలా వెళ్ళింది ?, మరో వైపు అదే గణేశ్ విగ్రహంలోకి 100 కోట్లు ఎలా వచ్చాయి ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.