Gam Gam Ganesha | ‘గం..గం..గణేశా’ మూవీ రివ్యూ..
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, రాజ్ అర్జున్, సత్యం రాజేష్ తదితరులు.
దర్శకుడు: ఉదయ్ బొమ్మిశెట్టి
నిర్మాతలు : కేదర్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి
సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్
Gam Gam Ganesha | టాలీవుడ్ యువ నటుడు ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘గం..గం..గణేశా’ (Gam Gam Ganesha). ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ఉదయ్ శెట్టి ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్లు విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కామెడీతో పాటు రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ చూసుకుంటే.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. గణేశ్ (ఆనంద్ దేవరకొండ) ఒక అనాథ. తన స్నేహితుడు ఇమాన్యూయల్తో కలిసి చిన్నప్పటినుంచే దొంగతనాలు చేయడం మొదలు పెడతాడు. మరోవైపు శ్రుతి (నయన్ సారిక)తో ప్రేమలో ఉంటాడు. అయితే శ్రుతి మాత్రం తనకు బెటర్ ఆప్షన్ దొరకగానే గణేశ్‌ని వదిలి వెళ్లిపోతుంది. అయితే ఈ క్రమంలోనే గణేష్ అనుకోకుండా ఒక డైమండ్‌ను దొంగతనం చేస్తాడు. ఆ డైమండ్ కోసం ఒక గ్యాంగ్ గణేష్ వెంటపడుతుంది. ఈ క్రమంలో ఆ డైమండ్ కోసం గణేశ్ ఏం చేశాడు ?, అసలు ఆ డైమండ్ ముంబై నుంచి తెస్తున్న గణేశ్ విగ్రహంలోకి ఎలా వెళ్ళింది ?, మరో వైపు అదే గణేశ్ విగ్రహంలోకి 100 కోట్లు ఎలా వచ్చాయి ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: క్రైమ్ కామెడీ జోనర్లో తెలుగులో సినిమాలు రావడం చాలా అరుదు. తాజాగా ఈ కోవలోనే వచ్చింది ఈ చిత్రం. ఇక టీజర్, ట్రైలర్లతోనే మంచి బజ్ క్రీయేట్ చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో గణేశ్ పాత్రకు సంబంధించిన డైమండ్ ట్రాక్.. అలాగే మరోవైపు వంద కోట్లు ట్రాక్.. ఆ ట్రాక్ తో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి ‘‘గం గం గణేశా’’ సినిమా కొన్ని చోట్ల ఆకట్టుకుంది. ముఖ్యంగా కామెడీ టోన్ తో సాగే కొన్ని సస్పెన్స్ సీన్స్ అండ్ ట్విస్ట్ లు అండ్ ఎమోషన్స్ వంటివి సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
నటీనటులు: నటనపరంగా ఆద్యంతం ఆకట్టుకుంటాడు ఆనంద్ దేవరకొండ. తన లుక్స్ అండ్ ఫిజిక్ బాగా మెయింటైన్ చేశాడు. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాయి. శ్రుతి పాత్రలో కనిపించిన నయన్ సారిక అందంగా వుంది. ఇమ్మాన్యుయేల్ పాత్ర నవ్వించేలా ఉంది.
సాంకేతికంగా : టెక్నికల్‌గా ఈ సినిమా టాప్ క్లాస్ లో వుంది. ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకోగా.. ఆదిత్య జవ్వాది వాటిని తెరకెక్కించిన విధానం కూడా ఆకట్టుకుంది. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. ఇక దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి మొదటి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించాడు.
ప్లస్ పాయింట్స్ : ఆనంద్ దేవరకొండ, కామెడీ, క్లైమాక్స్, నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్ : అక్కడక్కడా నెమ్మదించిన కథనం, స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం,