ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఈ హీరో నటిస్తోన్న తాజా చిత్రం ‘సెబాస్టియన్ పీసీ 524’ (Sebastian PC524 Trailer). బాలాజీ సయ్యపురెడ్డి (Balaji Sayyapureddy) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 4న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. కోమలీ ప్రసాద్ (Komalee Prasad), సువేక్ష ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇవాళ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.
ఏందన్నా అంతా చీకటిగా ఉండాది..అని ఓ వ్యక్తి అంటుంటే..చీకటా ఓడమ్మా..అండర్ ది కంట్రోల్ ద సెబాస్టియన్..ఇక్కడ వీచే గాలి..లేని వెలుతురు..ఉన్న చీకటి సాక్షిగా అంటూ కిరణ్ అబ్బవరం తనదైన స్టైల్లో చెబుతున్న డైలాగ్స్ తో ట్రైలర్ మొదలైంది. కిరణ్ అబ్బవరం రేచీకటి ఉన్న కానిస్టేబుల్‌గా కనిపించనున్నట్టు ట్రైలర్ తో చెప్పేశాడు దర్శకుడు. కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చాక తనకున్న రేచీకటి వల్ల నైట్ డ్యూటీ చేయలేక ఎలాంటి ఇబ్బందులు పడ్డాడనేది..అనుకోని పరిస్థితుల కారణంగా ఉద్యోగాన్ని ఎలా కోల్పోయాడు…అనే విషయాలను ఫన్నీగా, సీరియస్ యాంగిల్లో చూపించబోతున్నాడని ట్రైలర్ తో తెలిసిపోతుంది.
ఈ చిత్రాన్ని జ్యోవిత సినిమాస్ బ్యానర్‌పై ఎలైట్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో సిద్ధారెడ్డి బి. జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించారు. శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణి రఘువరన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీత దర్శకుడు.